Pakistan National Assembly Dissolved : జాతీయ అసెంబ్లీ రద్దు చేయాలని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చేసిన సిఫార్సు మేరకు ఆ దేశ అధ్యక్షుడు అరిఫ్ అల్వీ అందుకు అంగీకరించారు. గడువుకు కొన్ని గంటల ముందే అక్కడి ప్రభుత్వం రద్దయినట్లయ్యింది. త్వరలోనే ఆపద్ధర్మ ప్రభుత్వం కొలువుదీరనుంది. దీంతో ఎన్నికలను వచ్చే 90 రోజుల్లో పూర్తిచేసేందుకు వెసులుబాటు ఉంది. పాకిస్థాన్ పార్లమెంటు రద్దు కావడం వల్ల నవంబర్‌లోనే ఎన్నికలు జరుగుతాయని భావిస్తున్నారు. కానీ, ఇవి మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Pakistan National Assembly Election 2023 :ఇటీవలి జనాభా లెక్కల ప్రకారం.. గత ఆరేళ్లలో పాకిస్థాన్ జనాభా 16 శాతం అంటే 20 కోట్ల నుంచి 24కోట్లకు పెరిగింది. తాజా నియోజకవర్గాల పునర్విభజన ప్రకారమే ఎన్నికలు జరపాలని అక్కడి చట్టాలు చెబుతున్నాయి. దీంతో ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి కనీసం నాలుగు నెలలు పడుతుందని పాక్ ఎన్నికల సంఘం-ECP చెబుతోంది. దీంతో పాకిస్థాన్‌లో ఎన్నికలు నిర్వహించడం ఈ ఏడాది సాధ్యం కాకపోవచ్చని.. మరింత సమయం పట్టే అవకాశం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. పాక్‌లో 2023లో ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదని ఆ దేశ మంత్రి రాణా సనావుల్లా కూడా అభిప్రాయపడ్డారు.
Pakistan Caretaker Government 2023 :ప్రస్తుతం పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ రద్దుకావడం వల్ల ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు పాలనా వ్యవహారాలు ఆపద్ధర్మ ప్రభుత్వం నిర్వహిస్తుంది. అయితే, జాతీయ అసెంబ్లీ రద్దయిన మూడు రోజుల్లోనే ఇది ఏర్పాటు కావాలి. అధికార, విపక్ష పార్టీలు కలిసి.. ఆపద్ధర్మ ప్రధానిగా ఎవరుంటారనే విషయంపై ఓ నిర్ణయానికి రావాలి. ఒకవేళ అక్కడ విఫలమైతే.. అఖిలపక్ష నాయకులతో కూడిన పార్లమెంటరీ కమిటీకి కొన్ని పేర్లను సూచించాలి. అక్కడ ఏకాభిప్రాయంతో నిర్ణయిస్తే సరిపోతుంది. అక్కడ కూడా విఫలమైతే అభ్యర్థుల జాబితాను ఎన్నికల సంఘానికి పంపిస్తారు. తదుపరి రెండు రోజుల్లో ఒకరి పేరును ఎన్నికల సంఘం నిర్ణయిస్తుంది.