పాకిస్థాన్‌లో మరో ఘోర ప్రమాదం జరిగింది. మదర్సా విద్యార్థులు ప్రయాణిస్తున్న ఓ పడవ నీటిలో మునిగిపోయింది. ఈ ఘటనలో 17 మంది విద్యార్థులు మృతి చెందారు. 13 మంది గాయపడ్డారు.
మదర్సా మిర్బాష్ ఖేల్‌కు చెందిన విద్యార్థులు.. టూర్లో భాగంగా ఖైబర్ పఖ్తుంఖ్వా రాష్ట్రంలోని కోహట్ జిల్లాలో ఉన్న తండా డ్యామ్‌ను చూసేందుకు వచ్చారు. ఓ బోటులో ప్రయాణిస్తుండగా అది హఠాత్తుగా నీటిలో మునిగిపోయింది. వెంటనే సహాయక చర్యలు చేపట్టిన రెస్క్యూ సిబ్బంది.. మృతదేహాలను బయటకు తీశారు.
పాక్‌లో మరో ప్రమాదం.. డ్యామ్‌లో మునిగిన బోటు.. 17 మంది పిల్లలు మృతి - పాకిస్థాన్ బోటు ప్రమాదం
పాకిస్థాన్‌లో జరిగిన మరో ఘోర ప్రమాదంలో 17 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. వీరు ప్రయాణిస్తున్న పడవ నీటిలో మునిగిపోవడం వల్ల ఈ దుర్ఘటన జరిగింది.
పడవలో 30 మంది ప్రయాణిస్తున్నారని కోహట్ డిప్యూటీ కమిషనర్ ఫర్ఖాన్ అష్రఫ్ తెలిపారు. అందులో ఎక్కువ మంది చిన్నారులే ఉన్నారని చెప్పారు. విద్యార్థుల వయసు ఏడు నుంచి 14 ఏళ్ల మధ్య ఉంటుందని అధికారులు తెలిపారు. 13 మంది చిన్నారులను రెస్క్యూ టీమ్ క్షేమంగా కాపాడిందని, వారిని వెంటనే దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకెళ్లామని అష్రఫ్ వివరించారు.
పాక్ ఆర్మీకి చెందిన రెస్క్యూ బృందాలు సైతం ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయం అందించాలని ఖైబర్ పఖ్తుంఖ్వా ఆపద్ధర్మ సీఎం కేపీకే ఆజం ఖాన్.. స్థానిక అధికారులను ఆదేశించారు.
లోయలో పడి..
మరోవైపు, పాక్‌లో ఆదివారం ఉదయం ఓ ఘోర ప్రమాదం జరిగింది. 48 మంది ప్రయాణికులతో వెళ్తున్న వాహనం లోయలో పడింది. ఈ ఘటనలో 42 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదానికి గురైన వాహనం క్వెట్టా నుంచి కరాచీ వెళ్తోంది. అదుపు తప్పి అది లోయలో పడిపోయింది. అనంతరం వాహనానికి మంటలు అంటుకున్నాయి. ఈ ఘటన బలూచిస్థాన్‌లోని లాస్బెలా ప్రాంతంలో జరిగింది. ఓ మహిళ, చిన్నారితో సహా ముగ్గురిని ప్రాణాలతో కాపాడామని లాస్బెలా అసిస్టెంట్ కమిషనర్ అంజా అంజుమ్ తెలిపారు.