తెలంగాణ

telangana

By

Published : Dec 27, 2022, 10:48 PM IST

ETV Bharat / international

ఆర్థిక సంక్షోభంలో పాక్​.. అమెరికాలోని ఎంబసీ ఆస్తులు అమ్మకం!

అమెరికాలోని తమ ఎంబసీ ఆస్తులను అమ్మేందుకు పాకిస్థాన్‌ సిద్ధమైంది. వాషింగ్టన్‌లో ఉన్న వీటిని కొనుగోలు చేసేందుకు మూడు సంస్థలు ముందుకొచ్చినట్లు పాక్‌ మీడియా వెల్లడించింది.

pakistan financial crisis
పాకిస్థాన్ ఎంబసీ ఆస్తులు అమ్మకం

పాకిస్థాన్‌ తీవ్ర ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతోంది. దీంతో తమను ఆదుకోవాలంటూ అంతర్జాతీయ సంస్థలతోపాటు వివిధ దేశాలను వేడుకుంటోంది. ప్రభుత్వాన్ని నడపలేక ఉద్యోగుల జీతాల్లోనూ కోత విధించడం వంటి చర్యలకు ఉపక్రమిస్తోంది. ఈ క్రమంలో అమెరికాలోని పాకిస్థాన్‌ ఎంబసీలో ఉన్న ఆస్తులను అమ్మేందుకు పాకిస్థాన్‌ సిద్ధమైంది. వాషింగ్టన్‌లో ఉన్న వీటిని కొనుగోలు చేసేందుకు మూడు సంస్థలు ముందుకొచ్చినట్లు పాక్‌ మీడియా వెల్లడించింది.

వాషింగ్టన్‌లోని పాకిస్థాన్‌ రాయబార కార్యాలయానికి చెందిన ఆస్తులను ఆమ్మకానికి పెట్టగా.. మూడు కంపెనీలు బిడ్ల దాఖలు చేసినట్లు పాకిస్థాన్‌కు చెందిన డాన్‌ పత్రిక వెల్లడించింది. జువిష్‌కు చెందిన ఓ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ 6.8మిలియన్‌ డాలర్లతో అత్యధికంగా బిడ్‌ను వేసినట్లు తెలిపింది. ఇందులో రెండో స్థానంలో భారత్‌కు చెందిన రియాల్టీ సంస్థ నిలిచింది. 5మిలియన్‌ డాలర్లతో భారత్ సంస్థ బిడ్‌ వేయగా.. పాకిస్థాన్‌కు చెందిన మరో రియాల్టీ సంస్థ 4మిలియన్‌ డాలర్లను కోట్‌ చేసినట్లు సమాచారం.

పాకిస్థాన్‌కు వాషింగ్టన్‌లోని రెండు ప్రాంతాల్లో రాయబార కార్యాలయాలు ఉన్నాయి. అందులో ఒకటి పాతది కాగా మరొకటి కొత్తది. వాషింగ్టన్ నగరంలోని ప్రధాన కేంద్రమైన ఆర్ స్ట్రీట్‌లో ఉన్న భవనాన్ని 1953-56లో అప్పటి పాకిస్థాన్ రాయబారి సయ్యద్ అంజద్‌ అలీ కొనుగోలు చేశారు. అప్పటి నుంచి 2000 వరకు అందులో కార్యకలాపాలు కొనసాగాయి. ప్రస్తుతం కొత్త భవనంలో పాక్ ఎంబసీ కొనసాగుతోంది. గత రెండు దశాబ్దాలుగా ఆర్ స్ట్రీట్ భవనం నిరుపయోగంగా ఉండటం, ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకోవడంతో స్థానికుల నుంచి ఫిర్యాదులు వస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పాకిస్థాన్ ఈ భవనాన్ని అమ్మకానికి పెట్టినట్లు తెలుస్తోంది.

ABOUT THE AUTHOR

...view details