rotten bodies in pak hospital: పాకిస్థాన్లోని ఓ ప్రభుత్వ ఆస్పత్రి డాబాపై కుళ్లిపోయిన మృతదేహాలు కనిపించడం కలకలం రేపుతోంది. ఇవి కచ్చితంగా కనిపించకుండా పోయిన వ్యక్తుల మృతదేహాలే అయి ఉండొచ్చని బలూచిస్థాన్ వేర్పాటుదారులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై స్పందించిన పంజాబ్ ముఖ్యమంత్రి పర్వేజ్ ఇలాహీ.. నష్టనివారణ చర్యల్లో భాగంగా ఘటనపై ఉన్నత స్థాయి విచారణ చేపట్టాలని శుక్రవారం ఆదేశించారు. ఆరోగ్య సంరక్షణ కార్యదర్శి ముజామిల్ బషీర్ నేతృత్వంలో ఏర్పడ్డ ఈ విచారణ కమిటీలో ఆరుగురు సభ్యులు ఉన్నారు. సమగ్ర విచారణ చేపట్టేందుకు ప్రభుత్వం వీరికి మూడు రోజుల గడువు ఇచ్చింది.
లాహోర్లోని ముల్తాన్‌లోని నిష్టర్ ఆసుపత్రిని గురువారం ముఖ్యమంత్రి సలహాదారు చౌదరి జమాన్ గుజ్జర్ సందర్శించారు. మార్చురీ పైకప్పుపై దొరికిన మృతదేహాలను చూశారు. కుళ్లిన మృతదేహాలకు దహన సంస్కారాలు నిర్వహించాలని.. అలాగే ఈ విషయంలో ప్రమేయం ఉన్న ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని ఆరోగ్య అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.