Pakistan Imran Khan Jail Facility : పాకిస్థాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్(పీటీఐ) చీఫ్, పాక్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్‌ను ఈగలు, పురుగులతో నిండిన జైలులో ఉంచారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. జీవింతాంతం జైలు జీవితం గడిపేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పినట్లు పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ మీడియా ఛానెల్ జియో న్యూస్ వెల్లడించింది. కాగా, తోషాఖానా (ప్రభుత్వ కానుకలను అక్రమంగా అమ్మకం) కుంభకోణం కేసులో దోషిగా తేలిన ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం పంజాబ్ ప్రావిన్స్‌లోని అటక్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు.
సీ-క్లాస్ ఖైదీకి కల్పించే సౌకర్యాలా..?
Pakistan Ex PM Attock Jail Facilities : పాకిస్థాన్‌కు క్రికెట్లో ప్రపంచకప్‌ను తెచ్చిపెట్టిన మాజీ కెప్టెన్‌ను పంజాబ్ ప్రావిన్సులోని అటక్ జైలులో చీమలు, ఈగలు, దోమలు, పురుగులతో కూడిన బహిరంగ బాత్రూం ఉన్న ఓ చీకటి గదిలో ఉంచారని.. 70 ఏళ్ల వయసున్న ఇమ్రాన్‌కు సీ-క్లాస్ ఖైదీకి కల్పించే సౌకర్యాలు కల్పించారని ఆయన తరఫు న్యాయవాది నయీమ్ హైదర్ పంజోథా పేర్కొన్నారు. ఇమ్రాన్‌పై నేరారోపణలకు సంబంధించి కోర్టు తీర్పును సవాలు చేసేందుకు అవసరమైన న్యాయపరమైన పత్రాలపై సంతకాలు చేయించుకునేందుకు సోమవారం ఆయన ఇమ్రాన్‌ను కలిసేందుకు జైలుకు వెళ్లారు. జైలు అధికారి సమక్షంలో ఖాన్‌తో ఒక గంట 45 నిమిషాల పాటు పంజోథా మాట్లాడారు. ఈ క్రమంలోనే జైల్లో కల్పిస్తోన్న సదుపాయాలు దారుణంగా ఉన్నాయని ఇమ్రాన్ చెప్పారని.. అలాగే ఆయన ఎదుర్కొంటున్న ఈ దుస్థితిని గురించి తాను స్వయంగా అడిగి తెలుసుకున్నట్లుగా లాయర్ వివరించారు. తన జీవితాంతం జైలు జీవితం గడిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఇమ్రాన్ తనతో చెప్పినట్లు న్యాయవాది నయీమ్ వార్తా ఛానల్‌కు చెప్పారు.
"ఓ చిన్న చీకటి గదిలో నన్ను నిర్భందించారు. అందులో టీవీ, వార్తాపత్రికలు కూడా లేవు. అందులోనే వాష్‌రూమ్ ఉంది. ఈగలు, చీమల బెడద ఎక్కువగా ఉంది. నన్నో ఉగ్రవాదిగా చూస్తున్నారు! ఎవరినీ కలిసేందుకు కూడా అనుమతించడం లేదు. అయినప్పటికీ.. నా మిగతా జీవితం మొత్తం జైల్లోనే ఉండేందుకు సిద్ధంగా ఉన్నా"