Pakistan Economy Crisis : తీవ్ర ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న పాకిస్థాన్‌కు మరిన్ని కష్టాలు వచ్చి పడ్డాయి. విదేశీ మారకనిల్వలు అడుగంటిపోవడం వల్ల నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటిన వేళ.. రుణాల కోసం అంతర్జాతీయ సంస్థల వద్ద అర్రులు చాస్తోంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ-ఐఎమ్ఎఫ్ ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీ కోసం.. కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఐఎమ్ఎఫ్ షరతులన్నింటికీ అంగీకరిస్తున్న షెహబాజ్ షరీఫ్ సర్కార్.. తాజాగా ప్రజలపై పన్నుల భారం మోపాలని నిర్ణయించింది. 17వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించాలని భావిస్తోంది.
1.1 బిలియన్ డాలర్ల ఉద్దీపన ప్యాకేజీ కోసం పాకిస్థాన్ ప్రభుత్వం, ఐఎమ్ఎఫ్ మధ్య 10రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. రుణం ఇచ్చేందుకు ఐఎమ్ఎఫ్ షరతులు విధించినట్లు.. పాక్ ఆర్థిక మంత్రి ఇషాక్ దార్ తెలిపారు. సోమవారం నుంచి వర్చువల్‌గా చర్చలు కొనసాగనున్నాయని పేర్కొన్నారు. అయితే ఆ చర్చలకు ముందు కొన్ని చర్యలు చేపట్టాల్సి ఉందని పాక్ ఆర్థిక మంత్రి ఇషాక్ దార్ వెల్లడించారు.