తెలంగాణ

telangana

ETV Bharat / international

పాక్​ ప్రజలపై పెట్రో బాంబ్​.. లీటరుకు రూ.35 పెంపు - పాకిస్థాన్​లో పెట్రోల్​ ధరలు

ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న పాకిస్థాన్‌ క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడేందుకు శతవిధాల ప్రయత్నిస్తోంది. ఇప్పటికే మంత్రుల విదేశీ ప్రయాణాలు, లగ్జరీ కార్ల కొనుగోలుపై ఆంక్షలు విధించిన పాక్‌ ప్రభుత్వం.. ఇప్పుడు సామాన్యులపై పెను భారాన్ని మోపింది. ఆహార కొరత, విద్యుత్ సంక్షోభంతో ఇప్పటికే సతమతమవుతున్న ప్రజలకు, పెట్రో ధరతో షాక్‌ ఇచ్చింది. కనీవినీ ఎరుగని రీతిలో ఇంధన ధరలు పెంచి ప్రజల నడ్డివిరిచింది.

Pakistan Crude Oil Prices
పాకిస్థాన్​లో పెట్రోల్​ ధరలు

By

Published : Jan 29, 2023, 6:54 PM IST

పాకిస్థాన్​లో ఆర్థిక సంక్షోభం మరో శ్రీలంక పరిస్థితులను తలపిస్తోంది. ఇప్పటికే పొదుపు చర్యలంటూ అనేక నిర్ణయాలు తీసుకున్న దాయాది దేశం.. ఇప్పుడు సామాన్యులపై ఇంకో భారం మోపింది. పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్‌కు రూ.35 రూపాయల చొప్పున పెంచుతూ.. ప్రజల నడ్డివిరిచింది. ఆదివారమే పెంచిన ధరలు అమల్లోకి వచ్చినట్లు పాక్‌ ఆర్థిక మంత్రి ఇషాక్ దార్ ప్రకటించారు. పెట్రోల్‌, డీజిల్‌తోపాటు కిరోసిన్‌, లైట్‌ డీజిల్‌ ధరలను కూడా లీటర్‌కు రూ.18 రూపాయల చొప్పున షెహబాజ్‌ షరీఫ్‌ ప్రభుత్వం పెంచింది. తాజా నిర్ణయంతో పాకిస్థాన్​లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.249.80పైసలకు చేరగా.. హైస్పీడ్ డీజిల్‌ ధర రూ.262.80 పైసలకు పెరిగింది. కిరోసిన్‌ రూ.189.83 పైసలకు, లైట్‌ డీజిల్‌ రూ.187లకు చేరింది. పెట్రోల్, డీజిల్ ధరలు రూ.50కు పెంచుతారని సోషల్‌ మీడియాలో ఊహాగానాలు వచ్చిన వెంటనే పాక్‌లో పెట్రోల్‌ రూ.35 పెరిగింది. ధరల పెంపుతో పెట్రోల్‌ బంకుల వద్ద వాహనదారులు పెద్దఎత్తున బారులు తీరారు.

పాక్‌ ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడాలంటే.. అంతర్జాతీయ ద్రవ్య నిధి సాయం అత్యవసరమన్న పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌.. అందుకోసం ఎంత కఠినమైన ఆంక్షలకైనా సిద్ధమని ప్రకటించారు. ఐఎమ్​ఎఫ్ (అంతర్జాతీయ ద్రవ్య నిధి) ఇప్పుడు నిధులు విడుదల చేయకపోతే.. 6.5 బిలియన్‌ డాలర్ల నిధులన్నీ రద్దయిపోతాయి. అందుకే పాక్‌ సర్కార్‌ కఠిన నిర్ణయాలకు ఉపక్రమించినట్లు స్పష్టం అవుతోంది. షరతులకు అంగీకరించిన నేపథ్యంలో వచ్చేవారం తమ బృందం పాకిస్థాన్​లో పర్యటిస్తుందని ఐఎమ్ఎఫ్ వెల్లడించింది. ఐఎమ్​ఎఫ్ బృందం జనవరి 31నుంచి ఫిబ్రవరి 9 వరకు పాక్‌లో పర్యటిస్తుందని అధికారులు తెలిపారు. మరోవైపు పాకిస్థాన్‌ రూపీ మారకం విలువ రోజురోజుకు దిగజారుతోంది. శుక్రవారం అమెరికా డాలర్‌తో పోలిస్తే పాకిస్థాన్‌ రూపీ మారకం విలువ రూ.262.60 పైసల కనిష్ట స్థాయికి పతనమైంది.

ABOUT THE AUTHOR

...view details