తెలంగాణ

telangana

ETV Bharat / international

భారత్‌తో సత్సంబంధాలను కోరుకుంటున్నాం: షెహబాజ్‌ షరీఫ్‌

Pakistan On Modi Jammu Visit: పాకిస్థాన్​ నూతన ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్‌తో సత్సంబంధాలను కోరుకుంటున్నట్లు షెహబాజ్‌ షరీఫ్‌ చెప్పారు. అలాగే భారత ప్రధానమంత్రి కశ్మీర్​ పర్యటనపై అభ్యంతరం వ్యక్తం చేసింది పాకిస్థాన్.

nawaz sharif news
nawaz sharif news

By

Published : Apr 26, 2022, 7:51 AM IST

Pakistan On Modi Jammu Visit: జమ్మూ-కశ్మీర్​లో ప్రధాని మోదీ పర్యటించి పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడంపై పాకిస్థాన్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. అక్కడ పరిస్థితులు సజావుగా ఉన్నట్లు నమ్మించడానికి వేసిన మరో ఎత్తుగడగా పాక్‌ విదేశాంగ శాఖ అభివర్ణించింది. 2019 ఆగస్టులో జమ్మూ-కశ్మీర్​లో ఆర్టికల్‌ 370ని రద్దు చేసిన అనంతరం మోదీ తొలిసారిగా ఆదివారం అక్కడ పర్యటించారు.. ఈ సందర్భంగా చీనాబ్‌ నదిపై రెండు జల విద్యుత్‌ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. దీన్ని కూడా పాక్‌ తప్పుపట్టింది. ఆ ప్రాజెక్టులపై పాక్‌కు ఆభ్యంతరాలున్నాయని, వాటికి సంబంధించిన సమాచారాన్ని భారత్‌ తమతో పంచుకోలేదని పేర్కొంది. అక్కడ శంకుస్థాపనలు చేయడం ద్వారా భారత్‌ సింధు జలాల ఒప్పందాన్ని ప్రత్యక్షంగా ఉల్లంఘించిందని వ్యాఖ్యానించింది.

భారత్‌తో సత్సంబంధాలను కోరుకుంటున్నాం:భారత్‌తో సత్సంబంధాలను కోరుకుంటున్నట్లు పాకిస్థాన్‌ నూతన ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ చెప్పారు. జమ్మూ-కశ్మీర్​ వివాదానికి న్యాయమైన పరిష్కారం లేకుండా స్థిరమైన శాంతిని సాధించలేమని పేర్కొన్నారు. ఈ విషయాన్ని పాక్‌ విదేశాంగ శాఖ సోమవారం వెల్లడించింది. "కశ్మీర్​ వివాదాన్ని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానాలకు,కశ్మీరీల ఆకాంక్షలకు అనుగుణంగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని, అప్పుడే రెండు దేశాలు అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించేందుకు వీలవుతుందని షరీఫ్‌ అభిప్రాయపడున్నారు" అని పేర్కొంది.

జనాబ్‌! ఆయియే..:వైద్యచికిత్స మిషతో గత రెండున్నరేళ్లుగా బ్రిటన్‌లో ఉంటున్న పాకిస్థాన్‌ మాజీ ప్రధానమంత్రి నవాజ్‌ షరీఫ్‌ (72) స్వదేశ పునరాగమనానికి మార్గం సుగమం అయింది. పాక్‌లోని కొత్త ప్రభుత్వం ఈయనకు పాస్‌పోర్టు మంజూరు చేసింది. మూడు పర్యాయాలు ప్రధానమంత్రిగా పనిచేసిన నవాజ్‌ షరీఫ్‌ 2018లో ఇమ్రాన్‌ఖాన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. లండన్‌లో వైద్యచికిత్స నిమిత్తం లాహోర్‌ హైకోర్టు ఈయనకు నాలుగు వారాల అనుమతి ఇవ్వగా.. 2019 నవంబరు నుంచి అక్కడే ఉండిపోయారు. దేశంలో మారిన రాజకీయ పరిస్థితులతో ఇటీవల సొంత పార్టీ 'పాకిస్థాన్‌ ముస్లింలీగ్‌ -నవాజ్‌' అధికారంలోకి రావడమే. కాకుండా, స్వయానా తమ్ముడు షెహబాజ్‌ షరీఫ్‌ ప్రధానమంత్రి కావడం వల్ల నవాజ్‌ పునరాగమనం ఎప్పుడో ఖాయమైంది. అర్జెంటు కేటగిరీలో పదేళ్ల పాటు చెల్లుబాటయ్యేలా ఏప్రిల్‌ 2న నవాజ్‌ షరీఫ్‌ పేరిట ఇస్లామాబాద్‌లో పాస్‌పోర్టు జారీ అయినట్లు స్థానిక మీడియాలో కథనాలు వచ్చాయి. పాక్‌ అంతర్గత వ్యవహారాల మంత్రి రాణా సనావల్లా మీడియాతో మాట్లాడుతూ.. త్వరలో నవాజ్‌ షరీఫ్‌కు పాస్‌పోర్టు అందజేస్తామన్నారు.

ఖైదీలకు రంజాన్‌ ఉపశమనం: రంజాన్‌ పండుగ నేపథ్యంలో పాకిస్థాన్‌ ఖైదీల శిక్షాకాలంలో రెండు నెలల ఉపశమనాన్ని కొత్త ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ ప్రకటించారు. ఉగ్రవాద కేసుల్లో శిక్షలు అనుభవిస్తున్నవారికి ఈ వెసులుబాటు వర్తించదని స్పష్టం చేశారు. కోట్‌ లఖ్​పత్‌ జైలును ఆదివారం సందర్శించిన షెహబాజ్‌ ఈ ఉపశమనాన్ని ప్రకటించారు. గతంలో హవాలా కేసులో తాను ఎనిమిది నెలల జైలుశిక్ష అనుభవించిన బ్యారక్స్‌ను కూడా ప్రధాని సందర్శించారు. జైళ్లలో సదుపాయాల కల్పనకు మంత్రి రాణా సనావుల్లా అధ్యక్షతన ఓ కమిటీని కూడా వేశారు.

పాక్‌ చదువులపై భారత్‌ ప్రకటనకు ఖండన: భారతీయ విద్యార్థులు ఎవరూ పాకిస్థాన్‌ విద్యాసంస్థల్లో చేరవద్దని, చేరదలచుకొంటే ముందస్తు అనుమతి తీసుకోవాలంటూ భారత్‌లోని యూనివర్సిటీ గ్రాంట్స్‌కమిషన్‌ (యూజీసీ), ఆలిండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ (ఏఐసీటీఈ) జారీ చేసిన సంయుక్త సూచనను పాక్‌ విదేశాంగ శాఖ కార్యాలయం ఖండించింది.

ఇదీ చదవండి:తగ్గేదే లే.. సైనిక వ్యయంలో భారత్, చైనా టాప్​!

ABOUT THE AUTHOR

...view details