Pakistan Bomb Blast News : పాకిస్థాన్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఉత్తర వజీరిస్థాన్‌లోని గుల్మీర్ కోట్ ప్రాంతంలో బాంబు దాడి చేశారు. ఈ ఘటనలో 11 మంది కూలీలు ప్రాణాలు కోల్పోయినట్లు పాకిస్థాన్ స్థానిక వార్తా సంస్థ ఏఆర్వై న్యూస్ వెల్లడించింది. ఓ వ్యానులో ఈ బాంబు పేలిందని పోలీసులు వెల్లడించారు.
Pakistan Terror Attack :ఇటీవల ఖైబర్ పఖ్తుంఖ్వాలోని బజౌర్ ప్రాంతంలో జరిగిన భారీ ఉగ్రదాడిని మరవక ముందే ఈ దారుణం జరగడం గమనార్హం. బజౌర్‌లో జరిగిన దాడిలో 63 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అందులో 23 మంది చిన్నారులు ఉన్నారు. 200 మందికి పైగా గాయాలయ్యాయి. ఈ దాడి చేసింది తామేనని ఇస్లామిక్ స్టేట్ ప్రకటించుకుంది. ఎన్నికల ర్యాలీని లక్ష్యంగా చేసుకొని ఈ దాడి చేశారు. జమైత్ ఉలేమా-ఇ-ఇస్లాం పార్టీకి చెందిన ఓ కార్యక్రమంలో దాడి జరిపారు. సూసైడ్ బాంబర్.. పేలుడు పదార్థాలు ధరించిన జాకెట్‌ను 400 మంది ఉన్న ప్రాంతంలో పేల్చేసుకున్నాడు.
Pakistan Terrorist Attack News :ఈ మధ్య కాలంలో పాకిస్థాన్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు భారీగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఖైబర్ పఖ్తుంఖ్వా, బలూచిస్థాన్ రాష్ట్రాల్లో తరచుగా దాడులు జరుగుతున్నాయి. ప్రభుత్వానికి, నిషేధిత ఉగ్రసంస్థ పాకిస్థాన్ తెహ్రీక్ ఇ-తాలిబాన్‌కు మధ్య కాల్పుల విరమణ గతేడాది నవంబర్‌లో నిలిచిపోయిన నేపథ్యంలో ఉగ్రదాడులు పెరుగుతున్నాయి. ఆత్మాహుతి దాడులు గణనీయంగా పెరుగుతున్నాయని జులైలో పాకిస్థాన్ విడుదల చేసిన నివేదికలో వెల్లడైంది. 2023లో తొలి ఏడు నెలల్లోనే 18 ఆత్మాహుతి దాడులు జరిగాయి. ఈ దాడుల్లో 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 450 మంది గాయపడ్డారు.
Pakistan Terror Attack 2023 :
కాగా, ఉగ్ర సంస్థలకు పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసీమ్ మునీర్ తీవ్ర హెచ్చరికలు చేశారు. చర్చలకు బలవంతంగా ఒప్పించేందుకే ఆ సంస్థలు దాడులకు తెగబడుతున్నాయని వ్యాఖ్యానించారు. అవన్నీ వృథా ప్రయాసలేనని, ఇవేవీ తమపై ఒత్తిడి పెంచబోవని అన్నారు. వారంతా పాకిస్థాన్ చట్టాలకు అనుగుణంగా నడుచుకోవాలని స్పష్టం చేశారు.