తెలంగాణ

telangana

By

Published : Apr 25, 2023, 7:35 AM IST

Updated : Apr 25, 2023, 9:19 AM IST

ETV Bharat / international

పోలీస్​ స్టేషన్​పై అత్మాహుతి దాడి.. 12 మంది మృతి.. పాకిస్థానీ తాలిబన్ల పనే!

పాకిస్థాన్​లో దారుణం జరిగింది. పోలీస్​ స్టేషన్​ లక్ష్యంగా జరిగిన ఆత్మాహుతి దాడిలో 8 మంది పోలీసులు సహా.. 12 మంది మృతి చెందారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత వహించలేదు.

pakistan bomb blast latest
pakistan bomb blast latest

పాకిస్థాన్​లో దారుణం జరిగింది. పోలీస్ స్టేషన్ లక్ష్యంగా జరిగిన ఆత్మాహుతి దాడిలో 8 మంది పోలీసులు సహా 12మంది దుర్మరణం చెందారు. దాదాపు 50 మంది దాకా గాయపడ్డారు. ఖైబర్ పఖ్తుంఖ్వా రాష్ట్రంలోని స్వాత్​ వ్యాలీ జిల్లా కబాల్ ఠాణా వద్ద ఈ ఘటన జరిగింది. మొదట చిన్న బాంబు పేలిందని.. ఆ తర్వాత ఎక్కువ సామర్థ్యమున్న బాంబు పేలిందని పోలీసు ఉన్నతాధికారి అతౌల్లా ఖాన్ తెలిపారు. ఘటనా స్థలంలో పలు కార్లు ధ్వంసమయ్యాయి. చెట్లు నేలమట్టమయ్యాయి. రక్తపు మరకలతో ఉన్న క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అయితే, ఈ పేలుళ్లకు ఇప్పటివరకు ఎవరూ బాధ్యత వహించలేదు.

అంతకుముందు.. పోలీస్ స్టేషన్​లో జరిగిన 2 పేలుళ్లతో భవనం పూర్తిగా ధ్వంసమైనట్లు అధికారులు వెల్లడించారు. పోలీసులు కొందరు శిథిలాల కింద ప్రాణాలు కోల్పోయారని.. గాయపడినవారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించినట్లు తెలిపారు. ఈ దాడి కారణంగా స్థానిక ఆస్పత్రుల్లో ఎమర్జెన్సీ ప్రకటించామని.. విద్యుత్​ అంతరాయం కూడా ఏర్పడిందని తెలిపారు.

ధ్వంసమైన కార్లు

ఈ దాడితో ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్​లో హైఅలర్ట్ ప్రకటించారు. ఈ దాడికి ఏ ఉగ్రసంస్థ బాధ్యత తీసుకోనప్పటికీ.. ప్రభుత్వంతో కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిన తర్వాత పాకిస్థానీ తాలిబన్లు ఈ తరహా దాడులకు తెగబడుతున్నారు. దీంతో తాజా దాడి వారి పనేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దాడి జరిగిన పోలీస్​ స్టేషన్​లో సమీపంలో ఒక కౌంటర్​ టెర్రరిజం విభాగ కార్యాలయం, ఓ మసీదు ఉందని పోలీసులు తెలిపారు.
ఇదే ఖైబర్​ పంఖ్తుంక్వా రాష్ట్రంలోని.. లక్కి మర్వాట్​ జిల్లాలో కౌంటర్​ టెర్రరిజం విభాగం చేపట్టిన ఆపరేషన్​లో ముగ్గురు ఉగ్రవాదులతో పాటు ఓ పోలీసు అధికారి మృతి చెందారు. ఈ ఆపరేషన్​ జరిగిన గంటల వ్యవధిలో ఈ పేలుళ్లు సంభవించడం చర్చనీయాంశమైంది.

ఘటనా స్థలంలో కొనసాగుతున్న సహాయక చర్యలు

పాకిస్థాన్​ అంతర్గత వ్యవహారాల మంత్రి రాణా సనావుల్లా పేలుళ్లను ఖండించారు. ఈ ఘటనలో మృతి చెందిన వారి పట్ల విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి ఉగ్రదాడులను త్వరలో నిర్మూలిస్తామని చెప్పారు. ఇక, ఖైబర్​ పఖ్తుంఖ్వా తాత్కాలిక ముఖ్యమంత్రి మహ్మద్​ అజామ్ కూడా ఈ పేలుళ్లను తీవ్రంగా ఖండించారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులను అదేశించారు. విధి నిర్వహణలో అమరులై పోలీసులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
కాగా, పాకిస్థాన్​లో ఉగ్రవాద ఘటనలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. పోలీసులు, భద్రతా దళాలే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులు జరుపుతున్నారు. వీటిని దీటుగా ఎదుర్కొనేందుకు భద్రతా దళాలు కూడా పలు ఆపరేషన్లు చేపడుతున్నాయి.

ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న క్షతగాత్రులు
Last Updated : Apr 25, 2023, 9:19 AM IST

ABOUT THE AUTHOR

...view details