Pakistan Beggar Mafia :భిక్షాటన చేసేందుకు విదేశాలకు వెళ్తున్న 16 మంది పాకిస్థానీలనుఅరెస్ట్ చేసింది అక్కడి ప్రభుత్వం. సౌదీ అరేబియా వెళ్తున్న వీరిని పంజాబ్ ప్రావిన్స్‌లోని ముల్తాన్‌లో అదుపులోకి తీసుకున్నారు అధికారులు. వీరిని రెండు రోజుల క్రితం సౌదీ అరేబియా వెళ్తున్న విమానంలో పట్టుకుని అరెస్ట్ చేసినట్లు ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ తెలిపింది. వీరిలో 11 మంది మహిళలు, నలుగురు పురుషులు, ఓ చిన్నారి ఉన్నట్లు పేర్కొంది. వీరంతా ఉమ్రా వీసాలపై సౌదీకి వెళ్తున్నట్లు చెప్పింది. ఈ వీసాలను మక్కాకు వెళ్లే ముస్లింలకు ఇస్తారు. ఈ వీసా ఉన్న వాళ్లు ఏడాదిలో ఎప్పుడైనా మక్కాకు వెళ్లవచ్చు.
Pakistan Beggars News : వీరిని అరెస్ట్ చేసిన తర్వాత విచారించగా.. తాము భిక్షాటన చేసేందుకే సౌదీకి వెళ్తున్నట్లు వారు అంగీకరించారు. అక్కడ భిక్షాటన చేసి సంపాదించిన మొత్తంలో సగం నగదు.. ప్రయాణ ఏర్పాట్లు చేసిన ఏజెంట్లకు ఇవ్వాలని ఒప్పందం చేసుకున్నట్లు వివరించారు. ఉమ్రా వీసా గడువు ముగిసిన తర్వాత తిరిగి పాకిస్థాన్‌కు వస్తామని చెప్పారు. వీరిపై చర్యలు తీసుకుంటామని FIA అధికారులు వెల్లడించారు. ప్రపంచ దేశాలకు పాకిస్థాన్ బిచ్చగాళ్లను ఎగుమతి చేస్తోందన్న అక్కడి ప్రభుత్వ ప్రకటించిన రోజుల్లోనే ఈ ఘటన వెలుగు చూసింది.
'విదేశాల్లో బిచ్చగాళ్లంతా పాకిస్థానీలే'
Pakistan Begging Mafia : అంతకుముందు విదేశాల్లో ఉన్న పాకిస్థానీలకు సంబంధించి అక్కడి సెనెట్‌లో చర్చ జరిగింది. విదేశీ వ్యవహారాలపై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ దీనిపై చర్చించింది. పాకిస్థాన్‌కు చెందిన బిచ్చగాళ్లు భారీ సంఖ్యలో విదేశాలకు వెళ్తున్నట్లు విదేశాంగ శాఖ కార్యదర్శి జుల్ఫికర్ హైదర్ కమిటీకి వివరించారు. విదేశాల్లో అరెస్టవుతోన్న బిచ్చగాళ్లలో 90శాతం మంది తమ దేశానికి చెందినవారే ఉన్నట్లు వెల్లడించారు. వీరిలో ఎక్కువ మంది సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్‌కు వెళ్లేందుకు యాత్రికుల వీసాను ఉపయోగించుకుంటున్నారని చెప్పారు. అంతేకాకుండా పవిత్ర స్థలాల్లో అరెస్టవుతోన్న జేబు దొంగల్లోనూ మెజార్టీ సంఖ్య పాక్ జాతీయులదేనని తెలిపారు. పాక్ జేబు దొంగలకు ఇప్పటివరకు పశ్చిమాసియా దేశాలే గమ్యంగా ఉండగా.. అటువంటి వారికి ఇప్పుడు జపాన్ కొత్త గమ్యస్థానంగా మారుతోందన్నారు.