తీవ్ర ఆర్థిక సంక్షోభంతో పాకిస్థాన్ కొట్టుమిట్టాడుతోంది. నిత్యవసర వస్తువుల ధరల పెరుగుదల, పెట్రోలియం, గ్యాస్ నిల్వలు తగ్గిపోవడం, పతనమవుతోన్న కరెన్సీ విలువ, తీవ్ర ద్రవ్యోల్బణం వంటి అంశాలు పాక్‌ను వెంటాడుతున్నాయి. దీంతో సబ్సిడీల భారాన్ని మోయలేక చాలా వాటికి ప్రభుత్వం కోత పెడుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఇంధన పొదుపు ప్రణాళికలను ప్రకటించింది. ఇంధన ఆదాతోపాటు చమురు దిగుమతులను తగ్గించేందుకుగానూ మంగళవారం మంత్రివర్గం సమావేశమై.. ఈ మేరకు జాతీయ ఇంధన పరిరక్షణ ప్రణాళికను ఆమోదించింది. ఇందులో భాగంగా మార్కెట్లు, వివాహ వేదికలను సాధారణ సమయానికి ముందుగానే మూసివేస్తున్నట్లు తెలిపింది.
ఆర్థిక సంక్షోభంలో పాక్.. రాత్రి 8.30కే మార్కెట్లు బంద్.. బల్బుల తయారీ నిలిపివేత.. - పాకిస్థాన్ కరెంట్ కట్
ఆర్థిక సంక్షోభంతో సతమతం అవుతోన్న పాకిస్థాన్.. తాజాగా ఇంధన పొదుపు చర్యలు ప్రకటించింది. రాత్రి 8.30 గంటలకే మార్కెట్లు మూసివేస్తామని, ప్రభుత్వ కార్యాలయాల్లో 30 శాతం విద్యుత్ ఆదాకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది.
'రాత్రి 8.30 గంటలకే మార్కెట్లు, రాత్రి 10 గంటలకు వివాహ వేదికలను మూసివేయాలి. దీంతో 60 బిలియన్ల పాకిస్థానీ రూపాయలు ఆదా అవుతాయి. ఫిబ్రవరి నుంచి సాధారణ బల్బుల తయారీని నిలిపివేస్తాం. జులై నుంచి నాసిరకం ఫ్యాన్ల ఉత్పత్తిని ఆపేస్తాం. దీంతో.. మరో 37 బిలియన్లు ఆదా అవుతాయి. ఏడాదిలోపు కేవలం కొనికల్ గీజర్‌ల వాడకాన్ని తప్పనిసరి చేస్తాం. ఫలితంగా.. తక్కువ గ్యాస్ వినియోగంతో 92 బిలియన్లు మిగులుతాయి. వీధి దీపాల్లో మార్పులతో మరో 4 బిలియన్లు ఆదా అవుతాయి' అని రక్షణశాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ మీడియాకు వెల్లడించారు. ఇంధన పొదుపు ప్రణాళికను తక్షణమే అమలు చేస్తున్నామన్నారు.
'నేటి క్యాబినెట్ మీటింగ్‌లో లైట్లు వెలిగించలేదు. పగటి వెలుతురులోనే సమావేశం జరిగింది' అని విద్యుత్ ఆదా అంశాన్ని మంత్రి ప్రస్తావించారు. ప్రభుత్వ భవనాలు, కార్యాలయాల్లో వినియోగించే విద్యుత్‌లో 30 శాతాన్ని ఆదా చేసేందుకు యోచిస్తున్నామని, దీంతో ఖజానాకు 62 బిలియన్లు మిగులుతాయన్నారు. ఈ ఏడాది చివరి నాటికి ఎలక్ట్రిక్ బైక్‌లను ప్రవేశపెడతామని తెలిపారు. వాతావరణ మార్పుల సమస్య పరిష్కారానికి కూడా ఈ ప్రణాళిక సహాయపడుతుందని.. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న వాతావరణశాఖ మంత్రి షెర్రీ రెహ్మాన్ పేర్కొన్నారు. జాతీయ భద్రత కోసం ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ అవసరమని జాతీయ భద్రతా కమిటీ పేర్కొన్న మరుసటి రోజే పాక్ ఈ చర్యలు చేపట్టడం గమనార్హం.