Pak Letter To UNO Yasin Malik: కశ్మీరీ వేర్పాటువాద నాయకుడు యాసిన్ మాలిక్‌ను అన్ని కేసుల్లో నిర్దోషిగా ప్రకటించాలని పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ డిమాండ్ చేశారు. అతడ్ని తక్షణమే జైలు నుంచి విడుదల చేయాలని, తద్వారా కుటుంబాన్ని కలిసేలా చూడాలని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల హైకమిషనర్ మిషెల్ బాచెలేకు ఆయన లేఖ రాశారు.
కశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితులపై అంతర్జాతీయ సమాజం దృష్టిని ఆకర్షించేందుకు పాక్ చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా మే 24న బాచెలేకు లేఖ పంపినట్లు పాక్ విదేశాంగ కార్యాలయం బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. "కశ్మీరీలను అణచివేసి.. వారిని ప్రేరేపిత కేసుల్లో ఇరికించడానికి భారత ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను లేఖలో వివరించాము" అని చెప్పింది. ముఖ్యంగా యాసిన్ మాలిక్ పట్ల వ్యవహరించిన తీరును తక్షణమే గుర్తించి చర్యలు తీసుకోవాలని మానవ హక్కుల కౌన్సిల్‌ను భుట్టో లేఖలో కోరారు.