తెలంగాణ

telangana

ETV Bharat / international

అమెరికాలో పాక్ ఆర్థిక మంత్రికి చేదు అనుభవం.. 'చోర్..​ చోర్..'​ అంటూ ఎగతాళి - ఇషాక్​ దార్​ అవమాన ఘటన

అమెరికాలో పాక్​ ఆర్థిక మంత్రికి చేదు అనుభవం ఎదురైంది. కొందరు వ్యక్తులు అతన్ని ఉద్దేశిస్తూ చోర్‌..చోర్‌.. అని నినాదాలు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్​ మీడియాలో హల్​చల్​ చేస్తుంది.

pak finance minister ishaq dar
పాక్​ ఆర్థిక మంత్రి

By

Published : Oct 14, 2022, 10:26 PM IST

ఆర్థిక సంక్షోభం, వరదలు వంటి సవాళ్లతో పాకిస్థాన్‌ కొట్టుమిట్టాడుతోంది. వరుస సంక్షోభాల నుంచి దేశాన్ని బయటపడేయలేక ఆర్థిక మంత్రులే పదవి నుంచి వైదొలుగుతున్నారు. ఈ క్రమంలో అంతర్జాతీయ సంస్థల నుంచి రుణాలను తీసుకువచ్చేందుకు అమెరికా వెళ్లిన ఆ దేశ నూతన ఆర్థిక మంత్రికి చేదు అనుభవం ఎదురయ్యింది. వాషింగ్టన్‌లో దిగిన పాకిస్థాన్‌ ఆర్థిక మంత్రి ఇషాక్‌ దార్‌ను ఎయిర్‌పోర్టులో కొందరు వ్యక్తులు ఎగతాళి చేశారు. మంత్రిని ఉద్దేశిస్తూ చోర్‌..చోర్‌.. అని నినాదాలు చేసిన వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

అంతర్జాతీయ రుణ సంస్థలతో సమావేశమయ్యేందుకు పాకిస్థాన్‌ ఆర్థిక మంత్రి ఇషాక్‌ దార్‌ అమెరికా వెళ్లారు. ఆయనకు స్వాగతం పలికేందుకు అమెరికాలో పాకిస్థాన్‌ రాయబారి మసూద్‌ ఖాన్‌, ఇతర ఉన్నతాధికారులు డల్లస్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అదే సమయంలో అక్కడున్న కొందరు వ్యక్తులు ఇషాక్‌ దార్‌ని ఉద్దేశిస్తూ.. నువ్వు అబద్ధాలకోరువి. నువ్వొక దొంగ.. అంటూ ఎగతాళి చేశారు. దీంతో అక్కడే ఉన్న అధికార పార్టీ నేత మనీ భట్‌ వారిని వారించే ప్రయత్నం చేశారు.

స్వదేశంతోపాటు విదేశాల్లోని బహిరంగ ప్రదేశాల్లో పాకిస్థాన్‌ మంత్రులు ఇలా హేళనకు గురైన ఘటనలు ఇటీవల ఎక్కువయ్యాయి. పాక్‌ సమాచారశాఖ మంత్రి మరియుం ఔరంగజేబ్‌ను కూడా లండన్‌లో కొందరు ఇటీవల ఎగతాళి చేశారు. మరో కేంద్ర మంత్రి ఆసన్‌ ఇక్బాల్‌నూ ఇమ్రాన్‌ ఖాన్‌ మద్దతుదారులు ఓ రెస్టారెంట్‌లో గేలి చేశారు. అంతకుముందు సౌదీ అరేబియాలో పర్యటించిన పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌తోపాటు ఆయన బృందంపై పాకిస్థాన్‌కే చెందిన యాత్రికులు వ్యతిరేక నినాదాలు చేస్తూ అవహేళన చేశారు. తాజాగా అమెరికాలో కూడా ఇమ్రాన్‌ ఖాన్‌ మద్దతుదారులే ఈ చర్యలకు పాల్పడినట్లు అధికార పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.

గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోన్న పాకిస్థాన్‌లో ఆర్థికశాఖ మంత్రులు ఎక్కువ కాలం ఆ పదవిలో కొనసాగలేకపోతున్నారు. గడిచిన నాలుగేళ్లలోపే ఐదుగురు ఆర్థిక మంత్రులు ఆ పదవిని వీడారు. మొన్నటివరకు ఆ పదవిలో ఉన్న మిఫ్తా ఇస్మాయిల్‌ రాజీనామా చేయడంతో పీఎంఎల్‌-ఎన్‌ నేత ఇషాక్‌ దార్‌ ఆ బాధ్యతలు చేపట్టారు. ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌ వార్షిక సమావేశాల్లో పాల్గొనేందుకు ఇషాక్‌ దార్‌ అమెరికా వెళ్లిన నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

ABOUT THE AUTHOR

...view details