దుబాయ్‌లో జరిగిన "మోస్ట్ నోబుల్ నంబర్స్" వేలంలో.. ఓ నంబర్ ప్లేట్ భారీ ధర పలికింది. 'P7' అనే కారు నంబర్ ప్లేట్ ఏకంగా 55 మిలియన్ దిర్హమ్లకు (దాదాపు 122 కోట్ల రూపాయలకు) అమ్ముడుపోయింది. ఫ్రెంచ్-ఎమిరాటీ వ్యాపారవేత్త, టెలిగ్రామ్ యాప్ వ్యవస్థాపకులైన పావెల్ వాలెరివిచ్ దురోవ్.. ఈ నంబర్ ప్లేట్‌ను సొంతం చేసుకున్నారు. జుమేరాలోని ఫోర్ సీజన్స్ హోటల్లో ఈ వేలం పక్రియ జరిగింది.
మొదట 15 మిలియన్ దిర్హమ్ల (దాదాపు 33.5 కోట్ల రూపాయలు) వద్ద ఈ నంబర్ ప్లేట్ వేలం ప్రారంభమైంది. అనంతరం కొన్ని సెకన్లకే.. 30 మిలియన్ల దిర్హమ్లకు (66 కోట్ల 90 లక్షల రూపాయలకు) చేరింది. 25 మిలియన్ల దిర్హమ్ల వద్ద కాసేపు వేలం స్తబ్దుగా ఉన్నప్పటికీ.. అనంతరం 30 మిలియన్ల దిర్హమ్లకు.. ఆ వెంటనే 55 మిలియన్ దిర్హమ్లకు చేరుకుంది. వేలం పూర్తవగానే ప్రేక్షకుల చప్పట్లతో హాల్ మొత్తం మార్మోగింది. పావెల్ వాలెరివిచ్ దురోవ్‌కు అందరూ శుభాకాంక్షలు తెలిపారు.
P7తో పాటు మిగతా వీఐపీ నంబర్ ప్లేట్లు, ఫోన్ నంబర్లకు కూడా వేలం జరిగింది. ఈ వేలంతో మొత్తం 100 మిలియన్ దిర్హమ్లు (223 కోట్ల రూపాయలు) సమకూరినట్లు అధికారులు తెలిపారు. ఎమిరేట్స్ వేలం, దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ, ఎటిసలాట్ అండ్ డు అధ్వర్యంలో ఈ వేలం పక్రియ జరిగింది. ఇప్పటి వరకు దుబాయ్‌లో జరిగిన వేలంలో.. 'P7' మొదటి స్థానంలో నిలిచింది. 2008లో అబుదాబి నంబర్ 1 ప్లేట్‌ను 52.2 మిలియన్ దిర్హమ్లకు.. ఓ వ్యాపారవేత్త కొనుగోలు చేశారు.
ఆకలి తీర్చనున్న ఫ్యాన్సీ నంబర్ క్రేజ్!
ఈ వేలం ద్వారా వచ్చిన ఆదాయం మొత్తం.. వన్ బిలియన్ మీల్స్ ప్రచారానికి వెళుతుందని అధికారులు తెలిపారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఆకలితో అలమటిస్తున్న ప్రజల కోసం కృషి చేస్తుందని వారు వెల్లడించారు. అందుకోసం ఈ సంస్థ వివిధ కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. రంజాన్ ఉదార స్ఫూర్తికి అనుగుణంగా వన్ బిలియన్ మీల్స్ ఎండోమెంట్ కార్యక్రమాన్ని వైస్ ప్రెసిడెంట్, దుబాయ్ పాలకుడు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ ప్రారంభించారు.
వేలం పాటలో రూ. అరకోటికి అమ్ముడుపోయిన ఐఫోన్
కొద్ది రోజుల క్రితం అమెరికాలో 2007లో కొన్న ఫస్ట్ జనరేషన్ ఐఫోన్ మోడల్.. ఇటీవల రూ.52లక్షలకు (63వేల డాలర్లు) అమ్ముడుపోయింది. ఎల్సీజీ హౌస్ వేసిన వేలం పాటలో ఈ పాత ఫోన్‌ను కొనేందుకు ఎగబడ్డారు. ఇన్వెస్టర్లు, పాత ఫోన్లు సేకరించే వారు పెద్ద ఎత్తున ఈ వేలంలో పాల్గొన్నారు. 50వేల డాలర్లు వస్తాయని ముందుగా అంచనా వేయగా.. ఈ ఫోన్ ఏకంగా 63 వేల డాలర్లకు పైగా రాబట్టింది.పూర్తి వివరాల కోసం ఇక్కడి క్లిక్ చేయండి