తెలంగాణ

telangana

ETV Bharat / international

అమెరికా మధ్యంతర ఎన్నికలకు ఓటింగ్.. బైడెన్​, ట్రంప్​ మధ్య హోరాహోరీ పోరు

US Midterm Elections 2022 : అగ్రరాజ్యం అమెరికాలో మధ్యంతర ఎన్నికలకు రంగం సిద్ధమైంది. అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రతిష్ఠకు పరీక్షగా మారిన ఈ ఎన్నికలకు మంగళవారం ఓటింగ్‌ నిర్వహించనున్నారు.

US Midterm Elections 2022
US Midterm Elections 2022

By

Published : Nov 8, 2022, 2:22 PM IST

US Midterm Elections 2022 : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రతిష్ఠకు, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రాజకీయ భవిష్యత్తుకు పరీక్షగా మారిన అమెరికా మధ్యంతర ఎన్నికలకు మంగళవారం ఓటింగ్‌ జరగనుంది. అమెరికా కాంగ్రెస్‌లోని ప్రతినిధుల సభలో మొత్తం 435 స్థానాలకూ, సెనేట్‌లో మూడోవంతు అంటే 35 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. జో బైడెన్‌ రెండేళ్ల పాలనపై ప్రజాభిప్రాయాన్ని ఈ ఎన్నికల ఫలితాలు ప్రతిబింబించనున్నాయి. ఇప్పటికే 4 కోట్ల 20 లక్షల మంది అమెరికన్లు ముందస్తుగా మధ్యంతర ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం, ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మందగమనం లాంటి పరిస్థితులు నెలకొన్న వేళ జరుగుతున్న ఈ మధ్యంతర ఎన్నికలు అమెరికా రాజకీయాలపై ప్రభావం చూపనున్నాయి. అధ్యక్షుడు బైడెన్‌, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇప్పటికే ప్రచారంతో హోరెత్తించారు. ఒకరిపై ఒకరు విమర్శలు, ఆరోపణలతో విరుచుకుపడ్డారు. మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్లు గెలిస్తే ప్రజాస్వామ్య వ్యవస్థలు బలహీనపడతాయని బైడెన్‌ ఇప్పటికే అమెరికా ప్రజలను హెచ్చరించారు.

అమెరికా పార్లమెంట్‌ కాంగ్రెస్‌కు ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. కాంగ్రెస్‌లో రెండు సభలు ఉంటాయి. ఒకటి హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్‌ అంటే ప్రతినిధుల సభ, మరొకటి సెనేట్‌. అమెరికా అధ్యక్షుడి పదవీకాలం నాలుగేళ్లుకాగా కాంగ్రెస్‌కు ప్రతి రెండేళ్లకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. అమెరికా అధ్యక్షుడి పదవీకాలం మధ్యలో జరిగే ఈ ఎన్నికలను మధ్యంతర ఎన్నికలని పిలుస్తారు. అమెరికాలో 50 రాష్ట్రాలు ఉండగా.. ప్రతి రాష్ట్రం నుంచి ఇద్దరు సెనేటర్లు సెనేట్‌కు ప్రాతినిధ్యం వహిస్తారు.

సెనేట్‌లో మొత్తం 100 మంది ఉండగా వీరి పదవీకాలం ఆరేళ్లు. సెనేట్‌లో 35 స్థానాలకు ప్రస్తుతం ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇక ప్రతినిధుల సభలో 435 మంది ఉంటారు. అమెరికాలో రాష్ట్రాల జనాభాను బట్టి అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రతినిధుల సంఖ్య మారుతుంది. ప్రతినిధుల సభ పదవీకాలం రెండేళ్లు. ఇప్పుడు అందులోని 435 స్థానాలకూ ఎన్నికలు జరుగుతున్నాయి.

అధికార డెమొక్రటిక్‌ పార్టీకి గత రెండేళ్లుగా ఉభయ సభల్లో మెజారిటీ ఉంది. అందుకే జో బైడెన్‌ సులభంగా చట్టాలు చేయగలిగారు. మధ్యంతర ఎన్నికల్లో ఇరు పక్షాల మధ్య ఉత్కంఠ భరిత పోరు ఖాయంగా కనిపిస్తోంది. ప్రతినిధుల సభలో రిపబ్లికన్లు పాగా వేసే అవకాశం ఉందని, సెనేట్‌లో డెమొక్రాట్లదే పైచేయి కావచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. ప్రతినిధుల సభలో 435 స్థానాలు ఉండగా కేవలం 30 స్థానాల్లోనే గట్టిపోటీ నెలకొంది. మిగిలిన స్థానాలు ఏదో పార్టీకి దక్కనున్నాయి.

పెన్సిల్వేనియా, కాలిఫోర్నియా, ఒహియో, నార్త్ కరోలినా వంటి రాష్ట్రాల్లోని నగరాల చుట్టూ ఉన్న సబర్బన్ ప్రాంతాలు కీలకం కానున్నాయి. ఇక సెనేట్‌లో ఎన్నికలు జరుగుతున్న 35 స్థానాలకు హోరాహోరీ పోరు నెలకొంది. 12కిపైగా రాష్ట్రాల్లో గవర్నర్లను కూడా ఎన్నుకోనున్నారు. కాంగ్రెస్ అమెరికాలో చట్టాలు చేస్తుంది. ఏ చట్టాలపై ఓటు వేయాలో ప్రతినిధుల సభ నిర్ణయిస్తుంది. వాటిని ఆమోదించే లేదా నిరోధించే హక్కు సెనేట్‌కు ఉంటుంది. అలాగే, అధ్యక్షుడు చేసిన అపాయింట్‌మెంట్‌లను సెనేట్ నిర్ధరిస్తుంది. చాలా అరుదుగా అధ్యక్షుడికి వ్యతిరేకంగా దర్యాప్తు చేయవచ్చు.

ఇవీ చదవండి :'అమెరికా ఎన్నికల్లో జోక్యం చేసుకున్నాం.. ఇకపై కూడా కొనసాగిస్తాం'.. రష్యా వ్యాపారి కీలక వ్యాఖ్యలు

'కాప్‌-27' సమావేశం నుంచి బయటికెళ్లిన రిషి సునాక్.. చెవిలో చెప్పిన కొద్దిసేపటికే!

ABOUT THE AUTHOR

...view details