అమెరికాలో లేఆఫ్స్ వల్ల ఉద్యోగాలు కోల్పోయిన వేలాది మంది భారతీయులు.. హెచ్-1బీ వీసా గ్రేస్ పీరియడ్‌ను రెండు నెలల నుంచి ఏడాదికి పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం హెచ్-1బీ వీసాలు కలిగి ఉన్న వారు ఉద్యోగం కోల్పోయిన రెండు నెలల్లోగా కొత్త ఉద్యోగం వెతుక్కోవాల్సి ఉంటుంది. లేదంటే అమెరికా విడిచి వెళ్లాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆ రెండు నెలల గడువును ఏడాదికి పెంచాలని రెండు భారతీయ-అమెరికన్ సంస్థలు అధ్యక్షుడు జో బైడెన్‌ను అభ్యర్థిస్తూ ఆన్‌లైన్ పిటిషన్లు సమర్పించాయి.
'H1B గ్రేస్ పీరియడ్ ఏడాది!'.. వీసాల జారీ మరింత వేగం!! - హెచ్ 1బీ వీసా గ్రేస్ పీరియడ్
లేఆఫ్స్ వల్ల ఉద్యోగాలు కోల్పోయిన అమెరికాలో ఉన్న వేలాది మంది భారతీయులు.. హెచ్-1 బీ వీసా గ్రేస్ పీరియడ్‌ను పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రెండు నెలల గడువును ఏడాదికి పెంచాలని రెండు భారతీయ-అమెరికన్ సంస్థలు అధ్యక్షుడు జో బైడెన్‌ను అభ్యర్థిస్తూ ఆన్‌లైన్ పిటిషన్లు సమర్పించాయి.
ఫౌండేషన్ ఫర్ ఇండియా- ఇండియన్ డయాస్పోరా స్టడీస్, గ్లోబల్ టెక్నాలజీ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఈ మేరకు బైడెన్‌కు విజ్ఞప్తి చేశాయి. లేఆఫ్ ట్రాకర్ డాట్ కామ్ లెక్కల ప్రకారం ఒక్క జనవరిలోనే 91 వేల మంది ఐటీ ఉద్యోగులు అమెరికాలో ఉద్యోగాలు కోల్పోయారు. ఆ సంఖ్య రానున్న రోజుల్లో మరింత పెరగనుంది. మరోవైపు ఓవర్సీస్ ఇండియన్స్ అనే ఫేస్‌బుక్ గ్రూప్ యుఎస్‌లో ఉద్యోగాలు కోల్పోయిన తమకు భారతీయ కంపెనీల్లో ఉద్యోగాలు కల్పించాలని భారత ప్రభుత్వానికి పిటిషన్‌ను సమర్పించింది.
భారత్ వెలుపల యూఎస్ ఎంబసీలు..
వీసాల జారీలో జాప్యాన్ని తగ్గించడం కోసం భారత్ వెలుపల అమెరికన్ దౌత్య కార్యాలయాలను తెరవమని సూచించిన అధ్యక్ష కమిషన్ సిఫార్సులను అగ్రరాజ్యం అమెరికా అమలు చేసింది. వాటి ద్వారా భారత్‌లోని వీసా బ్యాక్ ల్యాగ్ బాగా తగ్గే అవకాశం ఉంది. కరోనా ఆంక్షలు ఎత్తేసిన తర్వాత అమెరికా వీసాల కోసం భారతీయులు పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకున్నారు. కాగా, గత నెలలో లక్ష మంది భారతీయులకు చెందిన వీసా దరఖాస్తుల ప్రక్రియను అమెరికా దౌత్య కార్యాలయం పూర్తి చేసింది. 2019 జులై తర్వాత ఒక నెలలో అన్ని దరఖాస్తులు క్లియర్ చేయడం ఇదే తొలిసారి.