తెలంగాణ

telangana

ETV Bharat / international

ఆకాశాన్ని తాకిన ఉల్లి ధర.. కేజీ రూ.1200.. వాసన చూసి బతికేస్తున్న ప్రజలు! - ఉల్లిగడ్డ ధర ఇండియా

ఉల్లి ధరకు రెక్కలు వచ్చాయి. కేజీ ఉల్లి రూ.1200 పలుకుతోంది. మార్కెట్​లో ఉల్లి కంటే చికెనే చీప్​గా లభిస్తోంది. ఫిలిప్పీన్స్​లో ఈ పరిస్థితి నెలకొంది. మరోవైపు, మహారాష్ట్రలో మాత్రం ఉల్లి ధర రూ.2కు పడిపోయింది.

onion-price-philippines
onion-price-philippines

By

Published : Feb 27, 2023, 5:06 PM IST

ఓ తెలుగు సినిమాలో పిసినారి వ్యక్తి.. కోడిని గాల్లో కట్టి.. దాన్నే చికెన్ అని ఊహించుకుంటూ తెల్ల అన్నం తింటాడు. ఓ దేశంలో మాత్రం ఈ సీన్ రివర్స్ అయింది. ప్లేట్​లో చికెన్ పెట్టుకొని.. గాల్లో ఉల్లిపాయలు కట్టుకుంటున్నారు! 'మేం రోజూ ఉల్లి తినేంత రిచ్ కాదు' అని జోకులు విసురుకుంటున్నారు. పెళ్లిళ్లకు హాజరైతే వధూవరులకు 'ఉల్లి బొకే' గిఫ్ట్​గా ఇస్తున్నారు. ఎందుకంటే.. ఆ దేశంలో ఉల్లికి ఆ రేంజ్​లో రెక్కలు వచ్చాయి మరి!

ఫిలిప్పీన్స్ దేశంలో ఈ పరిస్థితి నెలకొంది. రాజధాని మనీలాలోని సూపర్​ మార్కెట్లలో ఉల్లి ధర కేజీకి రూ.1200 పలుకుతోంది. చికెన్, మటన్, పోర్క్ కంటే ఉల్లి ధరే ఎక్కువగా ఉంది. రెస్టారెంట్లు తమ రెసిపీల నుంచి ఉల్లి వాడకాన్ని తగ్గించేశాయి. ఇక సాధారణ ప్రజలు ఉల్లిని దాదాపుగా దూరం పెడుతున్నారు. దేశంలో ద్రవ్యోల్బణం 14 ఏళ్ల గరిష్ఠానికి చేరిన నేపథ్యంలో ఉల్లి ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి.

"నేను మార్కెట్​కు వెళ్తే అక్కడ చిన్న చిన్న ఉల్లిపాయలు కనిపించాయి. అవి చిన్నపిల్లల పిడికిలి కంటే చిన్నగా ఉన్నాయి. వాటిని ఒక్కోటి రూ.120కి విక్రయిస్తామని చెబుతున్నారు. అంత ధర పెట్టి మేం ఉల్లి కొనలేం. అదే విషయం నా కుటుంబానికి చెప్పేశా. ఉల్లిపాయలు తినే బదులు జస్ట్ వాసన చూసుకోవాలని చెప్పా."
-క్యాండీ రోసా(56), ఫిలిప్పీన్స్ మహిళ

ఇక ఈ డిమాండ్​ను క్యాష్ చేసుకునేందుకు ఉల్లి రైతులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లోని రైతులైతే.. ఉల్లి పూర్తిగా ఎదగక ముందే వాటిని విక్రయానికి తీసుకొస్తున్నారు. మరోవైపు, డిమాండ్​కు సరిపడా సరఫరా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. విదేశాల నుంచి 21వేల టన్నుల ఉల్లి దిగుమతికి పచ్చజెండా ఊపింది. పెద్ద ఎత్తున ఉల్లిని నిల్వ చేస్తున్న వ్యాపారులను టార్గెట్ చేస్తోంది. అయినప్పటికీ, ఉల్లి రేటు మాత్రం ఆకాశం నుంచి దిగి రావడం లేదు. "ఇప్పుడు జరుగుతున్నది చారిత్రకం. గతంలో ఎన్నడూ ఉల్లి ధరలు ఈ స్థాయిలో లేవు. డిసెంబర్​లో నేను ఉల్లి సాగు ప్రారంభించా. అప్పుడు కిలో రూ.380గా ఉండేది" అని ఉల్లి రైతు ఏంజిలిస్(37) తెలిపారు. సగం ఎదిగిన ఉల్లినే ఈయన విక్రయిస్తున్నారు. వీటికి కూడా డిమాండ్ ఎక్కువగా ఉంది.

వాలెంటైన్స్ డేకు ఉల్లి బొకేలు ఇచ్చుకున్న ఫిలిప్పీన్స్ ప్రేమజంటలు

ఈ పరిస్థితుల్లో ఉల్లి స్మగ్లింగ్ సైతం ఊపందుకుంది. ఇటీవల మధ్య ఆసియా నుంచి వచ్చిన ఓ విమానం నుంచి ఉల్లి బస్తాలను మనీలా విమానయాన సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా వీటిని దేశానికి తీసుకొచ్చినట్లు అధికారులు గుర్తించారు. అధికారిక గణాంకాల ప్రకారం ఒక్కో ఫిలిప్పీన్స్ పౌరుడు ఏడాదికి సగటున 2.34 కిలోల ఉల్లిని తింటాడు. దేశీయ డిమాండ్​ను తీర్చే స్థాయిలోనే అక్కడ ఉల్లి ఉత్పత్తి అవుతోంది. కానీ, ఫిలిప్పీన్స్​లో వాతావరణ పరిస్థితుల వల్ల ఏడాదికి ఒకేసారి ఉల్లి పంట వేసే అవకాశం ఉంది. అధిక వ్యర్థాల వల్ల తర్వాతి సీజన్​కు ముందే ఉల్లి నిల్వలు పడిపోయినట్లు తెలుస్తోంది.

కూరగాయల బొకే
ఉల్లిపాయలతో చేసిన బొకే

భారత్​లో మాత్రం..
ఇక ఫిలిప్పీన్స్​లో ఉల్లి ధరల గురించి ఇంటర్నెట్​లో జోకులు పేలుతున్నాయి. భారత్​లో పరిస్థితిని ఆ దేశంతో పోల్చుతూ మీమ్స్ షేర్ చేసుకుంటున్నారు నెటిజన్లు. మహారాష్ట్రలో ఉల్లి ధరలు భారీగా పడిపోవడాన్ని ప్రస్తావిస్తున్నారు. ప్రస్తుతం మహారాష్ట్రలో కేజీ ఉల్లి రూ.2 నుంచి రూ.4 మధ్య పలుకుతోంది. దీంతో తమ ఉత్పత్తులను విక్రయించకుండా వేలాన్ని అడ్డుకున్నారు నాశిక్ రైతులు. ఆసియాలోనే అతిపెద్ద ఉల్లి మార్కెట్​ అయిన లాసల్​గావ్ వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీలో వేలం ప్రారంభం కాగానే.. క్వింటాల్ ధర కనిష్ఠంగా రూ.200కు పడిపోయింది. గరిష్ఠంగా రూ.800 మాత్రమే వచ్చింది. సగటు ఉల్లి ధర రూ.400- రూ.450 మధ్య ఉంది.

దీంతో రైతులు సంఘాల నేతలు వెంటనే వేలం నిలిపివేశారు. ప్రభుత్వం ఉల్లిని రూ.15 -రూ.20కు కొనాలని డిమాండ్ చేశారు. క్వింటాల్​కు రూ.1500 చొప్పున గ్రాంట్ ప్రకటించాలని కోరారు. అప్పటివరకు లాసల్​గావ్​లో ఉల్లి విక్రయాలు జరగవని తేల్చి చెబుతున్నారు. ఇటీవలే సోలాపుర్​కు చెందిన ఓ రైతు మార్కెట్​కు 512 కేజీల ఉల్లి తీసుకొచ్చి కేవలం రెండు రూపాయలతో వెనుదిరిగాడు. కేజీ ఉల్లి ధర ఒక్క రూపాయి పలికిందని రాజేంద్ర చవాన్ అనే రైతు తెలిపాడు. అన్ని మినహాయింపుల తర్వాత చేతికి రెండు రూపాయలు వచ్చాయని చెప్పాడు.

ABOUT THE AUTHOR

...view details