ఒడిశాలోని బహనాగ రైల్వే స్టేషన్ వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదంపై ప్రపంచ దేశాల అధినేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అమెరికా, రష్యా, ఆస్ట్రేలియా, శ్రీలంక, నేపాల్, కెనడా, తైవాన్ తదితర దేశాలు తమ సంతాప సందేశాల్ని పంపించాయి.
"ఒడిశా బాలాసోర్ రైలు ప్రమాద బాధితులకు, వారి కుటుంబీకులకు సంతాపం వ్యక్తం చేస్తున్నాం. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాం."
- డెనిస్ అల్పినోవ్, రష్యా రాయబారి, దిల్లీ
భారతీయులకు అండగా కెనడా!
"భారతదేశంలోని ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదం గురించి వస్తున్న వార్తలు, చూపిస్తున్న దృశ్యాలు నా హృదయాన్ని కలిచివేశాయి. తమ ప్రియమైన వారిని కోల్పోయిన బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాను. నా మదిలో ఇంకా క్షతగాత్రుల దృశ్యాలు కదలాడుతూనే ఉన్నాయి. ఇలాంటి క్లిష్ట సమయంలో భారతీయులకు అండగా కెనడా ప్రజలు ఉంటారని స్పష్టం చేస్తున్నాను."
- జస్టిన్ ట్రూడో, కెనడా ప్రధానమంత్రి
మోదీకి నా సానుభూతి: నేపాల్ పీఎం
"భారతదేశంలోని ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో పలువురు మరణించడం నా మనస్సును కలిచివేసింది. ఇందుకు బాధిత కుటుంబీకులకు, భారత ప్రభుత్వానికి, ప్రధాని మోదీకి నా సానుభూతి వ్యక్తం చేస్తున్నాను."
- కామ్రేడ్ ప్రచండ, నేపాల్ ప్రధాని
'బాధితుల కోసం ప్రార్థన'
"భారత్లో జరిగిన రైలు ప్రమాద బాధితుల కోసం నేను ప్రార్థిస్తున్నాను. బాధుతలకు, వారి కుటుంబీకులకు నా సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాను. ప్రస్తుతం చేపడుతున్న ఉపశమన చర్యలు అవసరమైన వారికి మరింత మందిని సురక్షితంగా బయటకు తీస్తాయని ఆశిస్తున్నాను."
-త్సాయి ఇంగ్, తైవాన్ అధ్యక్షురాలు
భారత్లో ఈ దశాబ్దంలో జరిగిన అత్యంత ఘోర రైలు ప్రమాదంపై విచారం వ్యక్తం చేస్తూ ఆస్ట్రేలియా, శ్రీలంక విదేశాంగ మంత్రులు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఒడిశా రైలు ప్రమాదంపై దిల్లీలోని ఇటలీ ఎంబసీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. బాధిత భారతీయ కుటుంబాలకు తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నట్లు ఒక ప్రకటన విడుదల చేసింది. ఐక్య రాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సైతం ప్రమాదంపై విచారం వ్యక్తం చేసింది. భారత ప్రభుత్వానికి తమ సానుభూతి వ్యక్తం చేసింది. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం ఒడిశా రైలు ప్రమాదంలో సుమారు 278 మంది మరణించగా, దాదాపుగా 900 మంది తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో సహాయక చర్యలు పూర్తి అయ్యాయని రైల్వేశాఖ ప్రతినిధి అమితాబ్ శర్మ స్పష్టం చేశారు. ప్రస్తుతం సర్వీసు పునరుద్ధరణ పనులు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.
ఇవీ చదవండి: