తెలంగాణ

telangana

ETV Bharat / international

ఆ దేశాల మధ్య అణు యుద్ధం జరిగితే 500 కోట్ల మంది ప్రాణాలు గాల్లోకి - అణు యుద్ధం వస్తే

అత్యాధునిక అణు యుద్ధం సంభవిస్తే కనీసం 500 కోట్ల మంది ప్రాణాలు కోల్పోతారని ఓ పరిశోధనలో తేలింది. అమెరికా-రష్యా మధ్య జరిగే అణు యుద్ధం భూగోళంపై భయంకరమైన ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని పరిశోధన తేల్చింది. ఈ యుద్ధం వల్ల సగానికిపైగా మానవాళి తుడిచిపెట్టుకుపోతుందని పేర్కొంది.

nuclear war consequences
nuclear war consequences

By

Published : Aug 16, 2022, 4:17 PM IST

Nuclear War consequences: అత్యాధునిక అణు యుద్ధం సంభవిస్తే వాతావరణంలోకి చేరే ధూళి, ఉద్గారాల కారణంగా కరవు తలెత్తి కనీసం 500 కోట్ల మంది ప్రాణాలు కోల్పోతారని ఇటీవల నిర్వహించిన ఓ పరిశోధనలో తేలింది. రట్జర్స్‌ విశ్వవిద్యాలయంలోని ఓ బృందం అణు యుద్ధం జరిగేందుకు ఉన్న ఆరు అవకాశాలను విశ్లేషించింది. వీటిల్లో అమెరికా-రష్యా మధ్య జరిగే అణు యుద్ధం భూగోళంపై భయంకరమైన ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని తేల్చింది. సగానికిపైగా మానవాళి తుడిచిపెట్టుకుపోతుందని పేర్కొంది. ఈ పరిశోధన ఫలితాలను 'ది జర్నల్‌ నేచర్‌ ఫుడ్‌'లో ప్రచురించింది.

అణ్వాయుధ ప్రయోగం కారణంగా వాతావరణంలోకి ఎంత మొత్తం కర్బన ఉద్గారాలు చేరతాయనే దాని ఆధారంగా ఈ అంచనాలు తయారు చేశారు. ఇందుకోసం నిపుణులు వాతావరణ అంచనాలకు వినియోగించే ప్రత్యేకమైన టూల్స్‌ను వాడారు. అమెరికా జాతీయ వాతావరణ పరిశోధన కేంద్రం సహకారం కూడా తీసుకొన్నారు. దీంతో ప్రధాన పంటల ఉత్పత్తి దేశాల వారీగా ఎలా ఉండబోతుందనేది అంచనా వేశారు.

చిన్నస్థాయి సంక్షోభం కూడా ప్రపంచ ఆహారోత్పత్తిపై పెను ప్రభావం చూపుతుందని ఈ పరిశోధన వెల్లడించింది. కేవలం భారత్‌-పాక్‌ మధ్య స్థానికంగా జరిగే యుద్ధం కూడా ఐదేళ్లలోపు 7 శాతం పంట ఉత్పత్తులను తగ్గించేస్తుందని ఈ పరిశోధన తేల్చింది. అదే అమెరికా-రష్యా మధ్య ఘర్షణ చోటు చేసుకుంటే.. 90 శాతం వ్యవసాయం పడిపోతుందని హెచ్చరించింది. నిత్యావసరాలు తీర్చే పంటలు, ఆహార వృథా కట్టడి, జంతువుల నుంచి లభించే ఆహారం వంటివి తాత్కాలికంగా మాత్రమే ఈ ప్రభావం నుంచి తప్పించగలవని పేర్కొంది.

మంత్రుల హెచ్చరికలు..
ఉక్రెయిన్‌ను రష్యా ఆక్రమించిననాటి నుంచి యుద్ధ భయాలు పెరిగిపోయాయి. అమెరికా-రష్యా మధ్య పూర్తిస్థాయి ఘర్షణ వాతావరణం నెలకొంది. అదే సమయంలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌ భవిష్యత్తులో అణు యుద్ధం ముప్పు ఉందని హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో పరిశోధన వివరాలు బయటకు రావడం గమనార్హం.

ABOUT THE AUTHOR

...view details