తెలంగాణ

telangana

ETV Bharat / international

Kim Jong Un: 'కొవిడ్‌'తో కిమ్‌కు తీవ్ర అనారోగ్యం ? - కిమ్ జోంగ్ ఉన్ వార్తలు

Kim Jong Un ill with Corona: ఉత్తరకొరియాలో ఇటీవల కరోనా వైరస్‌ విజృంభించిన విషయం తెలిసిందే. ఆ దేశాధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ కూడా తీవ్ర అనారోగ్యం పాలయ్యారట. ఈ విషయాన్ని ఆయన సోదరి కిమ్‌ యో జోంగ్ తాజాగా వెల్లడించారు. అయితే ఆయనకు కరోనా సోకిందా లేదా అన్న విషయంపై మాత్రం ఆమె స్పష్టతనివ్వలేదు.

కిమ్‌కు తీవ్ర అనారోగ్యం
కిమ్‌కు తీవ్ర అనారోగ్యం

By

Published : Aug 12, 2022, 3:32 AM IST

Kim Jong Un ill with Corona: కరోనా మహమ్మారితో రెండేళ్ల పాటు యావత్‌ ప్రపంచం అల్లాడిన సమయంలో ఒక్క కేసు కూడా నమోదుకాని ఉత్తరకొరియాలో ఇటీవల వైరస్‌ విజృంభించిన విషయం తెలిసిందే. రోజుల వ్యవధిలోనే లక్షల మంది ప్రజలు జ్వరం బారినపడ్డారు. అదే సమయంలో దేశాధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ కూడా తీవ్ర అనారోగ్యం పాలయ్యారట. ఈ విషయాన్ని ఆయన సోదరి కిమ్‌ యో జోంగ్ తాజాగా వెల్లడించారు. అయితే ఆయనకు కరోనా సోకిందా లేదా అన్న విషయంపై మాత్రం ఆమె స్పష్టతనివ్వలేదు.

కిమ్‌ అనారోగ్యం గురించి ఆయన సోదరి ఓ ప్రసంగంలో చెప్పినట్లు ఉత్తరకొరియా అధికారిక మీడియా వెల్లడించింది. జ్వరం కారణంగా తన సోదరుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని కిమ్ యో జోంగ్‌ తెలిపారు. కానీ, ప్రజల పట్ల ఆయనకున్న ఆందోళనల కారణంగా ఒక్క క్షణం కూడా ఆయన విశ్రాంతి తీసుకోలేదన్నారు. అయితే, కిమ్‌ ఎప్పుడు అనారోగ్యానికి గురయ్యారన్న విషయాన్ని మాత్రం ఆమె వెల్లడించలేదు. ఈ సందర్భంగా.. దక్షిణకొరియాపై కిమ్‌ యో జోంగ్‌ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ దేశ ‘కీలుబొమ్మలు’ తమ సరిహద్దుల్లోకి బెలూన్ల ద్వారా విష వస్తువులను పంపించారని, అందుకే ఉత్తర కొరియాలో వైరస్‌ విజృంభించిందని ఆమె మండిపడ్డారు. ఇలాంటిది మళ్లీ జరిగితే దక్షిణ కొరియా అధికార యంత్రాంగాన్ని అంతం చేస్తామని హెచ్చరించారు.

యుద్ధాన్ని జయించా..: కిమ్‌

కాగా.. ఉత్తరకొరియా అధినేత అనారోగ్యానికి గురయ్యారంటూ ఆ దేశం స్వయంగా అంగీకరించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. గత కొంతకాలంగా కిమ్‌ అనారోగ్యంపై అనేక వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. అధిక బరువుతో బాధపడుతోన్న ఆయన ఇటీవల గుండె సంబంధిత వ్యాధితో ఆసుపత్రిలో చేరినట్లు కథనాలు వెలువడ్డాయి. ఇదిలా ఉండగా.. గత నెలలో కిమ్‌ దాదాపు 17 రోజుల పాటు మీడియాకు కన్పించలేదు. బుధవారమే అధికార పార్టీ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్వారెంటైన్‌ యుద్ధాన్ని జయించానని ఆయన చెప్పడంతో కిమ్‌కు కొవిడ్‌ సోకింది నిజమేనని తెలుస్తోంది.

ఈ ఏడాది ఏప్రిల్‌లో ఉత్తరకొరియాలో కరోనా మహమ్మారి విజృంభించిన విషయం తెలిసిందే. దాదాపు 48 లక్షల మంది ప్రజలు విష జ్వరాల బారిన పడ్డారు. అయితే సరైన వైద్య సదుపాయాలు , కరోనా పరీక్షల కిట్లు అందుబాటులో లేకపోవడంతో వీటిని కొవిడ్‌ కేసులుగా ఉ.కొరియా చెప్పలేదు. కేవలం కొన్ని కేసులను మాత్రమే కరోనా కేసులుగా నిర్ధారించింది. అయితే, ఈ వైరస్‌ ఉద్ధృతిని తాము జయించినట్లు మాత్రం ప్రకటించింది. ఈ మహమ్మారి కారణంగా 74 మంది మాత్రమే మరణించిట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నా.. అంతకంటే ఎక్కువ మరణాలే సంభవించి ఉండవచ్చన్న అంచనాలు వెలువడ్డాయి. కాగా.. ఈ వ్యాధి వ్యాప్తికి దక్షిణ కొరియానే కారణమని కిమ్‌ యంత్రాంగం ముందు నుంచీ ఆరోపణలు చేస్తూనే ఉంది. విదేశీ వస్తువులు తాకడం వల్లే తమవద్ద మొదటిసారి వ్యాప్తి ప్రారంభమైందని ఆరోపించింది.

ఇవీ చూడండి

ABOUT THE AUTHOR

...view details