North Korea Underwater Nuclear Drone :అణుదాడి సామర్థ్యం కలిగిన సముద్రగర్భ డ్రోన్‌ను పరీక్షించినట్లు ఉత్తర కొరియా మిలిటరీ శుక్రవారం తెలిపింది. అమెరికా, జపాన్ సంయుక్తంగా చేపట్టిన నౌకాదళ విన్యాసానికి ప్రతిస్పందనగా ఈ టెస్ట్ చేసినట్లు వెల్లడించింది. 'అణ్వాయుధ సామర్థ్యం కలిగిన అండర్‌వాటర్ డ్రోన్‌ను పరీక్షించాం. ఇది సముద్ర గర్భంలో శత్రువుల కదలికలను పసిగట్టి దాడి చేస్తుంది. అమెరికా, దాని మిత్రదేశాల నౌకాదళ విన్యాసాలను అడ్డుకోవడానికి మా ప్రతిచర్యలు ఇలాగే కొనసాగుతాయి' అని ఉత్తర కొరియా సైన్యం ఓ ప్రకటనలో తెలిపింది.
'సూదిమొనంత ఆక్రమించినా యుద్ధం తప్పదు'
దక్షిణ కొరియాతో చర్చలు సాగించే వ్యవస్థలను రద్దు చేస్తున్నట్లు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కొద్ది రోజుల క్రితం ప్రకటించారు. దక్షిణ కొరియాను నంబర్.1 శత్రువుగా నిర్వచించడానికి తన దేశం రాజ్యాంగాన్ని తిరిగి రాస్తుందని అన్నారు. సరిహద్దుల్లో సూదిమొనంత స్థలం ఆక్రమించినా దక్షిణ కొరియా యుద్ధాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఈ డ్రోన్ పరీక్షలు జరగడం గమనార్హం.
కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్త వాతావరణం
కిమ్ జోంగ్ ఉన్ఆయుధాల ప్రదర్శనను వేగవంతం చేస్తున్నారు. దీనికి ప్రతిస్పందనగా అమెరికా దాని ఆసియా మిత్ర దేశాలు సంయుక్త సైనిక విన్యాసాలను చేపడుతున్నాయి. అందులో భాగంగానే అమెరికా, జపాన్, దక్షిణ కొరియా మూడు రోజుల పాటు సంయుక్త నౌకాదళ విన్యాసాలు చేశాయి. ఆ నేవీ డ్రిల్స్ బుధవారం ముగిశాయి. ఈ నేపథ్యంలోనే ఉత్తర కొరియా తాజా పరీక్ష చేసింది. దీంతో కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.