North Korea Spy Satellite Launch Fail :గురువారం తాము ప్రయోగించిన రెండో స్పై శాటిలైట్ (గూఢచార ఉపగ్రహం) విఫలమైందని ఉత్తర కొరియా తెలిపింది. మూడు దశల రాకెట్లో తలెత్తిన లోపం కారణంగా ఈ ప్రయోగం ఫెయిల్ అయినట్లు వెల్లడించింది. ఈ ప్రయోగంలో జరిగిన వైఫల్యాలను అధ్యయనం చేసిన తర్వాత.. అక్టోబర్‌లో మూడోసారి ప్రయత్నించనున్నట్లు ఉత్తర కొరియా నేషనల్ ఏరోస్పేస్ డెవలప్‌మెంట్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది.
North Korea Spy Satellite Name :గూఢచార ఉపగ్రహం 'మల్లిగ్యోంగ్-1'ను కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు కొత్త తరహా రాకెట్ 'చోల్లిమా-1'ను ఉపయోగించినట్లు ఉత్తర కొరియా అంతరిక్ష సంస్థ తెలిపింది. రాకెట్.. మొదటి రెండు దశలు సాధారణంగానే సాగినా.. మూడో దశ ఎమర్జెన్సీ బ్లాస్టింగ్ సిస్టమ్‌లో లోపం కారణంగా ప్రయోగం చివరికి విఫలమైందని ఉత్తర కొరియా తెలిపింది.
ఉత్తర కొరియా ప్రయోగం కారణంగా జపాన్ 'జే-అలర్ట్' జారీ చేసింది. ఆ స్పై రాకెట్.. జపాన్ దక్షిణ ప్రాంతంలోని ఒకినావా దీవుల మీదుగా వెళ్లడం వల్ల.. అక్కడి స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించింది. శాంతి, స్థిరత్వానికి ఉత్తర కొరియా చేపట్టిన ఈ ప్రయోగం ముప్పు అని జపాన్ చీఫ్ కేబినెట్ సెక్రటరీ హిరోకాజు ముట్సునో అభివర్ణించారు. ఈ ప్రయోగం ద్వారా జరిగిన నష్టాన్ని పరిశీలించాలని, మిత్ర దేశాలతో సమన్వయం చేసుకోవాలని ప్రధాని ఫుమియో కిషిద ఆదేశించారని చెప్పారు. అయితే ఈ ప్రయోగం వల్ల జరిగిన నష్టంపై వివరాలు ఇంకా తెలియలేదని ఆయన అన్నారు.