Kim Jong Un Daughter : ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ వారసులు ఎవరనే విషయం చర్చనీయాంశమైంది. ఇటీవల తన కుమార్తెను తరచూ బయటకు తీసుకొస్తున్న కిమ్.. ఆమెకే తన పగ్గాలు అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది. కిమ్ రెండో కూతురు చువేయ్ వయసు 9 నుంచి పదేళ్ల మధ్య ఉంటుంది. ఆమె అంటే కిమ్‌కు ఎనలేని ప్రేమ అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. భార్య మినహా సాధారణంగా కుటుంబ సభ్యులు ఎవరినీ కిమ్ బయట ప్రపంచానికి చూపించడానికి ఇష్టపడరు. కానీ ఇటీవల తరచూ.. తన రెండో కూతురు చువేయ్‌ను అధికారిక కార్యక్రమాలకు బయటకు తీసుకొస్తున్నారు కిమ్. తాజాగా క్షిపణి శాస్త్రవేత్తలతో సమావేశానికి చువేయ్‌ను తీసుకెళ్లారు. ఈ మేరకు ఉత్తర కొరియా అధికారిక మీడియా చిత్రాలను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో కిమ్ తర్వాత ఉత్తర కొరియా పగ్గాలను చువేయ్ చేపడతారనే చర్చ జరుగుతోంది.
గత వారం ఉత్తర కొరియా బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాన్నితల్లిదండ్రులతో చువేయ్ వీక్షిస్తున్న చిత్రాలను తొలిసారి అధికారికంగా విడుదల చేశారు. వారం తిరగకుండానే తండ్రితో కలిసి క్షిపణి శాస్త్రవేత్తలతో ఆమె సమావేశమైన చిత్రాలను విడుదలచేశారు. కొరియా క్షిపణి శాస్త్రవేత్తలు, సాంకేతిక సిబ్బంది, అధికారులతో కిమ్, ఆయన రెండో కూతురు గ్రూప్ ఫోటో దిగారు. ఉత్తరకొరియా ప్రతిష్టాత్మకంగా తీసుకుని అభివృద్ధి చేస్తున్న వాసుంగ్-17 బాలిస్టిక్ క్షిపణికి ఈ శాస్త్రవేత్తలు, సిబ్బంది తుదిమెరుగులు దిద్దుతున్నారు.