North Korea missile : నియంతృత్వ కిమ్ జోంగ్ ఉన్ నాయకత్వంలోని ఉత్తర కొరియా మరోసారి క్షిపణి ప్రయోగం చేసింది. అమెరికాకు హెచ్చరికగా రెండు స్వల్పశ్రేణి క్షిపణులను ప్రయోగించింది. అణ్వాయుధ సామర్థ్యం కలిగిన సబ్‌మెరైన్‌ను దక్షిణ కొరియాకు అమెరికా తరలించిన నేపథ్యంలో హెచ్చరికగా కిమ్ ఈ క్షిపణి ప్రయోగాలు చేసినట్లు తెలుస్తోంది. ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్కు సమీపంలోని ఓ ప్రాంతం నుంచి ఈ క్షిపణులు దూసుకొచ్చాయని దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కార్యాలయం తెలిపింది. తెల్లవారుజామున 3.30 నుంచి 3.46 గంటల మధ్య క్షిపణులు ప్రయోగించారని తెలిపింది. మిసైళ్లు 550 కిలోమీటర్లు ప్రయాణించి కొరియా ద్వీపకల్పానికి తూర్పున సముద్ర జలాల్లో పడిపోయాయని వెల్లడించింది.
North Korea news: జపాన్ సైన్యం సైతం ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాలను నిర్ధరించింది. జపాన్ అధీనంలోని సముద్ర జలాలకు అవతల క్షిపణులు పడిపోయాయని తెలిపింది. ప్రస్తుతానికైతే దీని వల్ల సముద్రంలోని నౌకలకు నష్టం జరగలేదని వివరించింది. గగనతలంలో విమానాల రాకపోకలకు సైతం ఇబ్బంది లేదని స్పష్టం చేసింది. దశాబ్దాల తర్వాత అమెరికా తన అణ్వాయుధ సబ్‌మెరైన్‌ను దక్షిణ కొరియాకు తీసుకొచ్చింది. చివరిసారిగా 1980లలో అమెరికాకు చెందిన ఓ న్యూక్లియర్ సబ్‌మెరైన్.. దక్షిణ కొరియాకు వచ్చింది.