North Korea Kim Jong-un: ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ ఏం చేసినా.. ప్రపంచానికి తన మార్కు స్టైల్‌ను ప్రదర్శిస్తుంటారు. తాజాగా ఖండాంతర క్షిపణిని (హ్వాసాంగ్-17) ప్రయోగించి, జపాన్‌ను తీవ్ర ఆందోళనకు గురిచేశారు. ఆ లాంచింగ్ వీడియోకు హాలీవుడ్ టచ్ ఇచ్చి, నెట్టింట్లో విడుదల చేయగా, అది కాస్తా వైరల్‌గా మారింది.
కిమ్ లెదర్ జాకెట్, సన్ గ్లాసెస్ ధరించి.. హాలీవుడ్ నటుడి తరహాలో ఎంట్రీ ఇచ్చారు. పక్కన ఉన్న ఇద్దరు సైనికాధికారులకు సూచనలు చేస్తూ.. క్షిపణి ఉన్న స్థలాన్ని పరిశీలించారు. ఇక ప్రయోగ సమయం సమీపిస్తుండగా.. కిమ్ వాచ్‌ను తీక్షణంగా గమనిస్తూ.. ఆ తర్వాత స్టైల్‌గా తన సన్ గ్లాసెస్‌ను కిందకు దింపి, ఓకే చెప్పారు. ఈ వీడియో నడుస్తున్నంత సేపు, బ్యాగ్రౌండ్‌లో సస్సెన్స్ థ్రిల్లర్‌ను తలపించే మ్యూజిక్ వినిపిస్తూ ఉంటుంది. ఉత్తర కొరియాకు తన సైనిక సామర్థ్యాలపై విశ్వాసం పెరుగుతోందని ఈ వీడియో శైలిని చూస్తుంటే తెలుస్తోందని ఆ దేశ నిపుణులు వ్యాఖ్యానించారు.
హాలీవుడ్ నటుడి తరహాలో ఉత్తర కొరియా అధ్యక్షుడు
ఇదిలా ఉండగా.. ఉత్తరకొరియా అధినేతలకు సినిమాలంటే ఆస్తకి. గతంలో కిమ్ తండ్రి కిమ్ జోంగ్ ఇల్ తన దేశంలో సినిమా పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు దక్షిణ కొరియాకు చెందిన డైరెక్టర్, నటిని కిడ్నాప్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఆ దేశ ప్రజలు దారిద్య్రంలో బతుకీడుస్తున్నా.. కిమ్ ప్రభుత్వం సినిమాలపై చెప్పుకోదగ్గ స్థాయిలో నిధులు గుప్పిస్తుంటుంది. అయితే ఆ సినిమా నిర్మాణాల్లో ఎక్కువభాగం కిమ్ కుటుంబాన్ని కీర్తించడానికే కేటాయిస్తారట. కాగా, ఇప్పుడు రూపొందిన వీడియో కూడా హాలీవుడ్, దక్షిణ కొరియా చిత్రాలను స్ఫూర్తిగా తీసుకున్నట్లు కనిపిస్తోంది. మామూలుగా ఆ దేశం తమ ప్రజలపై విదేశీ ప్రభావాన్ని అంగీకరించదు. విదేశీ చిత్రాలు చూస్తూ, ఆ తరహా దుస్తులు ధరించిన వారిని శిక్షిస్తుంది. కానీ ప్రస్తుత వీడియోపై మాత్రం ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
కిమ్ లెదర్ జాకెట్, సన్ గ్లాసెస్ ధరించిన కిమ్ జోంగ్ ఉన్
ఇక ఇటీవల జరిగిన ప్రయోగాన్ని దక్షిణ కొరియా, జపాన్‌లు.. ఖండాంతర క్షిపణి (ఐసీబీఎం) ప్రయోగంగా భావిస్తున్నాయి. 2017 తర్వాత పూర్తి సామర్థ్యంతో కూడిన అతిపెద్ద ప్రయోగం ఇదేనని అనుమానిస్తున్నాయి. 'ఈసారి బాలిస్టిక్ క్షిపణి ఆరు వేల కి.మీ కంటే ఎక్కువ ఎత్తులో ప్రయాణించింది. ఇది 2017 నవంబరులో ప్రయోగించిన హ్వాసాంగ్-15 ఐసీబీఎం కంటే చాలా ఎక్కువ' అని జపాన్ మంత్రి ఒనికి అన్నారు.
ఇదీ చదవండి:హౌతీ దాడులు.. సౌదీ చమురు డిపోలో మంటలు