North Korea Rules: పాశ్చాత్య సంస్కృతికి వ్యతిరేకంగా కఠిన ఆంక్షలను విధించింది ఉత్తర కొరియా. 20 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య గల మహిళలను లక్ష్యంగా చేసుకుని నిబంధనల్ని అమలు చేస్తోందని మీడియా వర్గాలు తెలిపాయి. టైట్ జీన్స్, జుట్టుకు రంగులు, అసభ్యకర రాతలు గల బట్టలు ధరించడం లాంటి వాటిని కఠినంగా అణచివేస్తుంది. ఇలాంటి వేషధారణతో రోడ్లపై కనిపిస్తే పెట్రోలింగ్ అధికారులు పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్నారు. అనంతరం నేరాన్ని ఒప్పుకుని.. తిరిగి అలాంటి దుస్తులు ధరించమని హామీ ఇచ్చిన తర్వాతే వారిని విడుదల చేస్తున్నారు.
గత మేలోనే ఉత్తర కొరియా జీన్స్, హెయిర్ స్టైల్స్‌ను నిషేధించింది. ఈ విదేశీ అలంకరణను 'ప్రమాదకరమైన విషం'గా అభివర్ణించారు ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్. ఆయన ప్రకటన అనంతరం ఈ ఆంక్షల అమలుపై అధికారులు మరింత శ్రద్ధపెట్టారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే యాత్ లీగ్ వీటిని ప్రచారం చేస్తోంది. దేశవ్యాప్తంగా విద్యార్థులకు సమావేశాలను నిర్వహిస్తోంది. అత్యంత తీవ్రమైన సందర్భాల్లో నిబంధనల్ని ఉల్లంఘించినవారి పేరు, చిరునామాను లౌడ్స్పీకర్లలో ప్రచారం చేస్తామని యూత్‌లీగ్ సభ్యులు తెలిపారు. ఇన్ని నిబంధనలు విధించినా యువత విదేశీ సినిమాలు, దుస్తులు ధరించడంలో మార్పు రావడం లేదని పేర్కొన్నారు.
అణు నిరాయుధీకరణ మొదలుపెడితే సాయం చేస్తాం:మరోవైపు.. ఉత్తర కొరియా అణు నిరాయుధీకరణ చర్యలు ప్రారంభిస్తే.. ఆ దేశ అర్థిక వ్యవస్థ బలోపేతానికి కృషిచేస్తామన్నారు దక్షిణ కొరియా నూతన అధ్యక్షుడు యున్ సుక్ యోల్. మంగళవారం కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ఆయన పార్లమెంట్ ఆవరణలో మాట్లాడారు. ఉత్తర కొరియా సమస్యను చర్చలతో పరిష్కరించుకోవడానికి సిద్ధమన్నారు. ఉత్తర కొరియా అణు నిరాయుధీకరణ చేస్తే ప్రోత్సాహకాలను అందిస్తామని దక్షిణ కొరియా నాయకులు గతంలోను ప్రకటించారు. కానీ కిమ్ జోంగ్ ఉన్ ప్రభుత్వం వాటిని తిరస్కరించింది.