North Korea covid cases: కరోనా మహమ్మారి ఉద్భవించిన రెండేళ్ల వరకు తమ దేశంలో ఒక్క కేసు కూడా రాలేదని గొప్పగా చెప్పుకుంది ఉత్తర కొరియా. ఐరాస నేతృత్వంలోని కొవాక్స్ సహా ఇతర దేశాల నుంచి టీకాల సాయాన్ని తిరస్కరించింది. ఇప్పుడు ఆ దేశంలో కొవిడ్ మహమ్మారి పంజా విసురుతోంది. ఈ క్రమంలో.. కొవిడ్‌ను అరికట్టేందుకు కిమ్ జోంగ్ ఉన్ ప్రభుత్వం దేశ ప్రజలకు చేసిన సూచన చర్చనీయాంశంగా మారింది. కరోనాపై పోరాడేందుకు ఉప్పు నీళ్లు పుకిలించటం సహా ఇతర వంటింటి చిట్కాలను పాటించాలని సూచించింది.
సంప్రదాయ చికిత్సలే ఉత్తమమని ఓ మహిళ ఆ దేశ అధికార మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నట్లు రాయిటర్స్ తెలిపింది. తన పిల్లలు రోజుకు రెండు సార్లు ఉప్పు నీటిని పుకిలిస్తారని తెలిపినట్లు పేర్కొంది. కరోనా వైరస్‌పై పోరాడేందుకు వంటింటి చిట్కాల్లోని ఉప్పు నీళ్లు ఉత్తమమైనవి, వాటినే ప్రభుత్వం సిఫార్సు చేస్తున్నట్లు న్యూస్ ఏజెన్సీ తెలిపిందని, దాంతో పాటు విల్లో ఆకుల నీటిని రోజుకు మూడుసార్లు తాగాలని సూచించినట్లు తెలిపింది. ఈ ఆకులను జ్వరం లక్షణాలను తగ్గించేందుకు ఉపయోగిస్తారు. 'కరోనాపై పోరాటంలో అల్లం టీ ఉపయోగపడుతుంది. కరోనా అనగానే ముందుగా భయపడ్డాను. కానీ, వైద్యుల సలహాలు పాటించాక పెద్ద విషయమేమీ కాదని భావిస్తున్నా.' అని ఆ మహిళ పేర్కొన్నట్లు రాయిటర్స్ తెలిపింది.
1.7 మిలియన్ కేసులు:ఆ దేశ అధికారిక మీడియో కేసీఎన్ఏ ప్రకారం.. దేశంలో 1.7 మిలియన్లకు పైగా ప్రజలు జ్వరం లక్షణాలతో బాధపడుతున్నారు. బుధవారం ఒక్క రోజే 2.32 లక్షల మందికి జ్వరం లక్షణాలు బయటపడగా.. ఆరుగురు మరణించారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 62కు పెరిగింది. ప్రస్తుతం 6,91,170 మంది క్వారంటైన్లో ఉన్నారు. అయితే, జ్వరం లక్షణాలను ఇప్పటి వరకు కరోనాగా గుర్తించలేదు కిమ్ సర్కార్. అధికారికంగా చెప్పిన సంఖ్య కంటే కేసులు పలు రెట్లు అధికంగా ఉంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.