North Korea covid cases: ఉత్తర కొరియాలో కరోనా తొలి కేసు నమోదైనట్లు ప్రకటించిన మరుసటి రోజునే కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. తీవ్ర జ్వరంతో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. దేశవ్యాప్తంగా వేగంగా వ్యాప్తి చెందుతోందని, 3.5 లక్షల మందిలో జ్వరం లక్షణాలు కనిపించినట్లు అధికారులు తెలిపారు. అయితే, మొత్తం ఎంత మంది అనారోగ్యంతో బాధపడుతున్నారనే విషయంపై స్పష్టత లేదు. మరోవైపు.. అస్తవ్యస్తమైన ఆరోగ్య వ్యవస్థ, టీకాలు వేయని, పోషకాహార లోపం ఉన్న ప్రజలతో దేశంలో కొవిడ్-19 విజృంభించే అవకాశాలు మెండుగా ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు.
ఒక్క రోజే 18వేల మందికి: ఏప్రిల్ చివరి వారం నుంచి ఇప్పటివరకు 3.5 లక్షల మంది జ్వరపీడితులుగా మారినట్లు ఉత్తర కొరియా అధికారిక మీడియా కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. అందులో 1,62,200 మంది కోలుకున్నారని, కొత్తగా గురువారం ఒక్కరోజే 18,000 మందిలో జ్వరం లక్షణాలు కనిపించినట్లు పేర్కొంది. వారందరినీ ఐసోలేషన్‌కు తరలించి చికిత్స అందిస్తున్నామని, ఆరుగురు మృతి చెందగా అందులో ఒకరికి ఒమిక్రాన్ వేరియంట్ నిర్ధరణ అయిందని తెలిపింది కేసీఎన్ఏ. అయితే, కొవిడ్-19 ఎంత మందికి సోకిందనేది స్పష్టత లేదని వెల్లడించింది.
దేశవ్యాప్తంగా లాక్డౌన్: కరోనా ఉద్భవించిన రెండేళ్ల తర్వాత ఉత్తర కొరియాలో తొలి కేసు నమోదైంది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధిస్తూ గురువారం ఆదేశాలు జారీ చేసింది కిమ్ ప్రభుత్వం. పలువురికి కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ నిర్ధరణ అయినట్లు పలు అంతర్జాతీయ మీడియాలు పేర్కొన్నాయి. ఏప్రిల్ 25న పెద్ద ఎత్తున నిర్వహించిన మిలిటరీ పరేడ్ కారణంగానే వైరస్ వ్యాప్తి జరిగినట్లు తెలుస్తోంది. కరోనా నియంత్రణ ప్రధాన కేంద్రాన్ని గురువారం సందర్శిన కిమ్ జోంగ్ ఉన్.. అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వైరస్ కట్టడిలో విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు.