Nobel Prize In Physics 2023 : అతి చిన్న స్ప్లిట్ సెకన్లలో పరమాణువుల్లోని ఎలక్ట్రాన్‌లను పరిశీలించిన ముగ్గురు శాస్త్రవేత్తలకు భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతి వరించింది. పదార్థంలో ఎలక్ట్రాన్ డైనమిక్స్ అధ్యయనం కోసం కాంతి ఆటోసెకండ్ పల్స్‌ను ఉత్పత్తి చేసే ప్రయోగాత్మక పద్ధతులకుగాను అమెరికాకు చెందిన పెర్రీ అగోస్తిని, జర్మనీకి చెందిన ఫెరెన్స్ క్రౌజ్, స్వీడన్‌కు చెందిన అన్నె ఎల్ హ్యులియర్‌కు ఈ ఏడాది ఫిజిక్స్‌లో నోబెల్ బహుమతి దక్కింది. నోబెల్ బహుమతి కింద ఒక మిలియన్ డాలర్ల ప్రైజ్‌మనీ దక్కనుంది.
ఎలక్ట్రాన్ డైనమిక్స్‌లోని ఆటోసెకండ్ పల్స్ అధ్యయనానికి
Nobel Prize Winners 2023 : ఎలక్ట్రాన్ డైనమిక్స్ అధ్యయనంలో ఆటోసెకండ్ పల్స్‌ను ఉత్పత్తి చేసే పద్ధతులు కీలకం అయినట్లు రాయల్ స్వీడిష్ కమిటీ వెల్లడించింది. పరమాణువులు, అణువుల్లో ఎలక్ట్రాన్ల కదలికలు చాలా వేగంగా ఉంటాయి. వాటిని ఆటోసెకండ్స్‌లో కొలుస్తారు. ఆటోసెకండ్ లైటు ద్వారా ఎలక్ట్రాన్ల కదలికలను అధ్యయనం చేయవచ్చు. ఈ సాంకేతిక క్రమేణా అభివృద్ధి చెందుతున్నట్లు అకాడమీ తన ప్రకటనల్లో తెలిపింది. ఎలక్ట్రాన్ల అత్యంత వేగవంతమైన కదలికల స్నాప్‌షాట్‌లను తీయడానికి సరిపోయేంత తక్కువ కాంతిని వీరు సృష్టించారు. వాయువులోని పరమాణువులతో లేజర్ కాంతి పరస్పర చర్య నుంచి కొత్త ప్రభావాన్ని కనుగొన్నారు. ఈ ప్రభావాన్ని గతంలో సాధ్యమైన దానికంటే తక్కువ కాంతి పల్స్‌లను రూపొందించడానికి ఉపయోగించవచ్చని నిరూపించారు.