Nobel Prize Economics 2023 :అర్థిక శాస్త్రంలో ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారం అమెరికాకు చెందిన ఆర్థికవేత్త క్లాడియా గోల్డిన్‌కు దక్కింది. లేబర్ మార్కెట్‌లో మహిళా కార్మిక ఉత్పాదక శక్తిపై పరిశోధనకు గాను గోల్డిన్‌ను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్టు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వెల్లడించింది. క్లాడియా గోల్డిన్.. ప్రస్తుతం హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. అర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి అందుకున్న మూడో మహిళగా గోల్డిన్ ఖ్యాతినార్జించారు.
లేబర్ మార్కెట్‌లో మహిళల పాత్రపై అవగాహన పెంచుకోవడం సమాజానికి ఎంతో ముఖ్యమని నోబెల్ కమిటీ పేర్కొంది. ఈ అంశంలో గోల్డిన్ చేసిన పరిశోధనలు భవిష్యత్తులో అడ్డంకులు అధిగమించేందుకు మార్గం చూపినట్లు తెలిపింది. గోల్డిన్ పరిష్కారాలు చూపకపోయినా ఆమె చేసిన పరిశోధన ఈ సమస్యను అధిగమించేందుకు విధాన నిర్ణేతలకు ఉపయోగపడనున్నట్లు నోబెల్ కమిటీ పేర్కొంది.
Nobel Prize 2023 Winners List :ఈ ఏడాది నోబెల్ పురస్కారాల ప్రకటన గత సోమవారం ప్రారంభమైంది. తొలిరోజు వైద్య శాస్త్రంలో ఇద్దరికి నోబెల్ పురస్కారాన్ని ప్రకటించారు. కొవిడ్ మహమ్మారిపై పోరు కోసం సమర్థ ఎంఆర్‌ఎన్‌ఏ టీకాల అభివృద్ధికి మార్గం సుగమం చేసిన శాస్త్రవేత్తలు కాటలిన్ కరికో, డ్రూ వెయిస్‌మన్‌కు ఈ అవార్డు లభించింది. మంగళవారం భౌతిక శాస్త్ర విభాగంలో అమెరికాకు చెందిన పెర్రీ అగోస్తిని, జర్మనీకి చెందిన ఫెరెన్స్ క్రౌజ్, స్వీడన్‌కు చెందిన అన్నె ఎల్ హ్యులియర్‌కు, బుధవారం రసాయనశాస్త్ర విభాగంలో అమెరికాకు చెందిన మౌంగి బవెండి, లూయిస్ బ్రూస్, అలెక్సీ ఎకిమోవ్‌కు ప్రకటించారు. గురువారం రోజున సాహిత్యం విభాగంలో నార్వేకు చెందిన రచయిత జాన్ ఫోసేకు ప్రకటించారు. శుక్రవారం రోజున ప్రకటించిన 2023 నోబెల్ శాంతి బహుమతిని ఇరాన్‌కు చెందిన మానవ హక్కుల కార్యకర్త నార్గెస్ మొహమ్మదిని వరించింది. ఈ పురస్కారాలను ఈ ఏడాది డిసెంబరు 10న గ్రహీతలకు అందజేయనున్నారు.