Nobel Prize 2023 Chemistry : నానో టెక్నాలజీకి సంబంధించిన క్వాంటమ్ డాట్స్ ఆవిష్కరణ, అభివృద్ధికిగాను ఈ ఏడాది ముగ్గురు శాస్త్రవేత్తలను రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి వరించింది. అమెరికాకు చెందిన మౌంగి బవెండి(62), లూయిస్ బ్రూస్(80), అలెక్సీ ఎకిమోవ్(78)కు.. 2023కి నోబెల్ బహుమతిని స్వీడెన్లోని స్టాక్‌హోమ్‌లో జరిగిన కార్యక్రమంలో రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెన్స్ ప్రకటించింది.
నానో పార్టికల్స్, క్వాంటమ్ డాట్‌లను LED లైట్లు, టీవీ స్ర్కీన్ల తయారీలో ఉపయోగిస్తున్నారు. క్యాన్సర్ కణజాలాన్ని తొలగించేందుకు సర్జన్‌లకు మార్గనిర్దేశం చేయడానికి ఈ సాంకేతికతనే వినియోగిస్తున్నారు. పరిశోధకులు ప్రధానంగా రంగు కాంతిని సృష్టించడానికి క్వాంటమ్ డాట్‌లను ఉపయోగించారు. భవిష్యత్తులో సరళమైన ఎలక్ట్రానిక్స్, మినిస్క్యూల్ సెన్సార్‌లు, సన్నని సోలార్ సెల్స్, ఎన్‌క్రిప్టెడ్ క్వాంటం కమ్యూనికేషన్‌కు క్వాంటం డాట్‌లు దోహదం చేస్తాయని పరిశోధకులు విశ్వసిస్తున్నారు. నోబెల్ బహుమతి విజేతలకు ఒక మిలియన్ డాలర్ల ప్రైజ్‌మనీ దక్కనుంది.
"క్వాంటమ్ డాట్స్ అనేవి అతి సూక్ష్మమైన నానోపార్టికల్స్. వీటి ఆవిష్కరణ, అభివృద్ధిలో ఈ ముగ్గురు సైంటిస్టులు విస్తృతంగా పరిశోధనలు జరిపారు. నానో టెక్నాలజీలోని ఈ క్వాంటమ్ డాట్స్‌ను ఇప్పుడు టీవీల నుంచి ఎల్‌ఈడీ లైట్ల వరకు అనేక పరికరాల్లో వాడుతున్నాం. డాక్టర్లు కూడా ట్యూమర్ కణాలను తొలగించేందుకు ఈ టెక్నాలజీనే వినియోగిస్తున్నారు."
- రాయల్ స్వీడిష్ అకాడమీ
ప్రకటనకు ముందే పేర్లు లీక్!
మరోవైపు రసాయన శాస్త్రంలో ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారాల ప్రకటనకు ముందే అవార్డు గ్రహీతల పేర్లు లీకవ్వడం చర్చనీయాంశమైంది. వారి పేర్లను స్వీడిష్ మీడియా సంస్థలు తమ కథనాల్లో ప్రచురించాయి. రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ నుంచి తమకు ప్రెస్ నోట్ అందిందని ఆ కథనాల్లో పేర్కొన్నాయి. ఈ ఏడాది కెమిస్ట్రీలో నోబెల్ గ్రహీతల పేర్లను ప్రకటించడానికి కొద్ది గంటల ముందే వారి పేర్లు బయటకువచ్చాయి. ఈ కథనాలపై అకాడమీకి చెందిన నోబెల్ కెమిస్ట్రీ కమిటీ నిపుణులు హీనెర్ లింకె స్పందిస్తూ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అది తీవ్రమైన తప్పిదమే అని ఆయన పేర్కొన్నారు.