తెలంగాణ

telangana

ETV Bharat / international

ఫ్రెంచ్ రచయిత్రికి సాహిత్య నోబెల్.. 17వ మహిళగా రికార్డు.. - సాహిత్యంలో నోబెల్ అవార్డు

2022 ఏడాదికి సాహిత్య నోబెల్ ఫ్రెంచ్ రచయిత్రి అనీ ఎర్నాక్స్​ను వరించింది. వ్యక్తిగత జ్ఞాపకాలపై ఎర్నాక్స్ చేసిన రచనలకు ఈ పురస్కారం అందిస్తున్నట్లు నోబెల్ కమిటీ వెల్లడించింది.

nobel prize 2022 for literature
nobel prize 2022 for literature

By

Published : Oct 6, 2022, 4:36 PM IST

Updated : Oct 6, 2022, 5:40 PM IST

సాహిత్య రంగంలో ఈ ఏడాది నోబెల్ అవార్డును ఫ్రెంచ్ రచయిత్రి అనీ ఎర్నాక్స్​(82) దక్కించుకున్నారు. వ్యక్తిగత జ్ఞాపకశక్తి మూలాలు, దూరాలు, సామూహిక నియంత్రణపై చేసిన రచనలకు గానూ అని ఎర్నాక్స్‌ను నోబెల్‌ సాహిత్య పురస్కారానికి ఎంపిక చేసినట్లు స్వీడిష్‌ అకాడమీ శాశ్వత కార్యదర్శి మట్స్‌ మామ్‌ తెలిపారు. ఆత్మకథలతో రచనలు ప్రారంభించిన ఆమె.. జ్ఞాపకాలకు సంబంధించిన రచనల కోసం కల్పిత నవలను వదిలిపెట్టారు. ఎర్నాక్స్‌ 20కిపైగా పుస్తకాలు రాశారు. అందులో ఎక్కువగా చిన్నవే ఉన్నాయి. ఆమె జీవితంలో జరిగిన సంఘటనలు, తన చుట్టు ఉన్నవారి జీవితాలను తన పుస్తకాల్లో వివరించారు. తన రచనల్లో లైంగిక ఎన్‌కౌంటర్లు, అబార్షన్, అనారోగ్యం తల్లిదండ్రుల మరణాలకు అక్షరరూపం ఇచ్చిన ఆమె... ఎక్కడా రాజీపడకుండా, తాను చెప్పదలుచుకున్న విషయాన్ని సాధారణ భాషలో వివరించినట్లు నోబెల్‌ కమిటీ ప్రశంసించింది.

అనీ ఎర్నాక్స్

1940లో నార్మాండీలోని యెవెటోట్‌ అనే చిన్న పట్టణంలో ఎర్నాక్స్‌ పుట్టి పెరిగారు. అక్కడే తల్లిదండ్రులతో కలిసి ఓ దుకాణం, కేఫ్‌ను నడుపుతున్న ఎర్నాక్స్‌.. రచయిత్రి వైపు సాగించిన ప్రయాణం ఎంత సుదీర్ఘమైనది. గత కొన్నేళ్లుగా నోబెల్‌ పురస్కారం ఎర్నాక్స్‌కు వస్తుందంటూ ఊహాగానాలు చెలరేగేవి. అయితే, అవి ఇప్పటికి నిజమయ్యాయి. 1901 నుంచి ఇప్పటివరకు 119మందికి సాహిత్య నోబెల్‌ పురస్కారాలు ప్రదానం చేయగా.. ఈ జాబితాలో ఈ ప్రతిష్ఠాత్మక అవార్డుకు ఎంపికైన 17వ మహిళగా ఎర్నాక్స్‌ నిలవడం విశేషం.

ఇప్పటికే వైద్య, భౌతిక, రసాయన శాస్త్రాల్లో నోబెల్ విజేతల పేర్లను ప్రకటించారు. స్వీడన్​కు చెందిన శాస్త్రవేత్త స్వాంటే పాబోను వైద్య నోబెల్​కు ఎంపిక చేశారు. మానవ పరిణామ క్రమంపై ఆయన చేసిన పరిశోధనలకు ఈ అవార్డు దక్కించుకున్నారు. 'పవర్ ఆఫ్ క్వాంటమ్ మెకానిక్స్​'లో చేసిన పరిశోధనలకు గానూ ముగ్గురు శాస్త్రవేత్తలకు భౌతికశాస్త్రంలో ఈ ఏడాది నోబెల్ అవార్డు వరించింది. రసాయనశాస్త్రంలో నోబెల్ అవార్డును ముగ్గురు శాస్త్రవేత్తలు దక్కించుకున్నారు. శాంతి బహుమతి విజేతను శుక్రవారం, అక్టోబర్ 10వ తేదీన ఆర్థిక రంగంలో నోబెల్ గ్రహీత పేరును వెల్లడిస్తారు.

నోబెల్‌ బహుమతి గ్రహీతలకు 10లక్షల స్వీడిష్‌ క్రోనర్‌ (సుమారు 9లక్షల డాలర్లు) నగదు అందుతుంది. వీటిని ఈ ఏడాది డిసెంబర్‌ 10న అవార్డు గ్రహీతలకు అందజేస్తారు. స్వీడిష్‌ ఆవిష్కరణ కర్త, ఇంజినీర్‌, వ్యాపారవేత్తగా పేరుగాంచిన ఆల్‌ఫ్రెడ్‌ నోబెల్‌ పేరు మీదుగా ప్రపంచంలో వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వారికి ఈ అవార్డును ప్రదానం చేస్తున్నారు. 1896లో ఆల్‌ఫ్రెడ్‌ నోబెల్‌ మరణించగా.. 1901 నుంచి ఆయన ట్రస్ట్ ద్వారా ఈ అవార్డును అందజేస్తున్నారు.

Last Updated : Oct 6, 2022, 5:40 PM IST

ABOUT THE AUTHOR

...view details