తెలంగాణ

telangana

By

Published : Jan 12, 2023, 11:21 AM IST

ETV Bharat / international

అమెరికా విమాన సర్వీసులపై 'సైబర్ దాడి' అనుమానాలు.. బైడెన్​ ఏమన్నారంటే?

అమెరికాలో విమాన సర్వీసుల ఆటంకం వెనుక సైబర్‌ దాడి జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై అధ్యక్షుడు జో బైడెన్‌ స్పందించారు. తమ ప్రాధాన్యత అదేనని చెప్పారు. సాంకేతిక లోపాల గురించి ఆయన మాట్లాడారు.

cyberattack on faa white house
cyberattack on faa white house

అమెరికాలో విమాన సర్వీసులు ఇంకా సాధారణ స్థితికి రాలేదు. ఫెడరల్‌ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్‌ఏఏ)లో సాంకేతిక లోపం కారణంగా బుధవారం అగ్రరాజ్యంలో ఈ సేవలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఒక్కొక్కటిగా విమాన సేవల పునరుద్ధరణ జరుగుతున్నా.. ఇంకా వేలాది విమానాలు ఆలస్యంగానే నడుస్తున్నాయి. కాగా.. దీని వెనుక సైబర్‌ నేరగాళ్ల హస్తం ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవ్వగా.. ఆ వార్తలను శ్వేతసౌధం కొట్టిపారేసింది. అయితే సాంకేతిక లోపానికి గల కారణం మాత్రం ఇంకా స్పష్టత లేదని అధ్యక్షుడు బైడెన్‌ అన్నారు.

విమానాలు తిరిగే మార్గాల్లో మార్పులు చేర్పులు, వాతావరణ సమస్యలు, ప్రమాదాల గురించి విమాన సిబ్బందిని ఎప్పటికప్పుడు అలర్ట్‌ చేసేందుకు ఎఫ్‌ఏఏ.. ఎయిర్‌లైన్లకు ఇచ్చే నోటమ్‌ (నోటీస్‌ టు ఎయిర్‌ మిషన్స్‌) వ్యవస్థలో సాంకేతిక సమస్య తలెత్తడంతో అమెరికా వ్యాప్తంగా విమాన సేవలకు ఆటంకం ఏర్పడింది. దీంతో విమానాల భద్రతకు సంబంధించిన సమాచారాన్ని ఏజెన్సీ ధ్రువీకరించేందుకు వీలుగా కొన్ని గంటల పాటు అన్ని దేశీయ విమాన సర్వీసులను నిలిపివేయాలని ఎప్‌ఏఏ ఆదేశించింది. ఆ తర్వాత దాన్ని ఎత్తివేసినప్పటికీ విమానాల రాకపోకలు పూర్తిస్థాయిలో పునరుద్ధరించేందుకు ఎయిర్‌లైన్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.

మా ప్రాధాన్యత అదే : జో బైడెన్
ఆన్‌లైన్‌ ఫ్లైట్‌ ట్రాకర్‌ ప్రకారం.. ఇప్పటి వరకు అమెరికాలో దాదాపు 10వేలకు పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తుండగా.. మరో 1300లకు పైగా విమానాలు రద్దయ్యాయి. అమెరికాలో ఈ స్థాయిలో విమానాలు ఎయిర్‌పోర్టులకు పరిమితమవ్వడం గత రెండు దశాబ్దాల్లో ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో అనేక మంది పారిశ్రామిక వర్గాలు ప్రస్తుత పరిస్థితిని 2001లో 9/11 ఉగ్రదాడి అనంతర పరిణామాలతో పోలుస్తున్నారు.

ఈ క్రమంలోనే ఎఫ్‌ఏఏలో సాంకేతిక సమస్యకు సైబర్‌ దాడే కారణమై ఉంటుందనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీనిపై వైట్‌హౌస్‌ మీడియా కార్యదర్శి కెరిన్‌ జీన్‌ పెర్రీ మాట్లాడుతూ.. "ప్రస్తుతం సైబర్‌ దాడి జరిగిందనేందుకు ఎలాంటి ఆధారాలు లేవు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టి ఎప్పటికప్పుడు నివేదికలు ఇవ్వాలని అధ్యక్షుడు జో బైడెన్‌.. రవాణా మంత్రిత్వశాఖను ఆదేశించారు. ప్రయాణికుల భద్రతే మా ప్రథమ ప్రాధాన్యం. వారికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత మాపై ఉంది. అందువల్ల సాంకేతిక సమస్యకు మూల కారణం కనుగొని భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకుంటాం" అని వెల్లడించారు.

కారణం తెలియలేదు: బైడెన్‌
ఎఫ్‌ఏఏలో సాంకేతిక లోపంపై దర్యాప్తు చేయాలని అధ్యక్షుడు జో బైడెన్‌ ఆదేశించారు. సైబర్‌ దాడి కారణంగానే ఈ సమస్య తలెత్తిందా అని ప్రశ్నించగా.. 'మాకు తెలియదు' అని సమాధానమిచ్చారు. "సాంకేతిక సమస్యకు కారణమేంటో ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుతం విమానాలు సురక్షితంగా ల్యాండ్‌ అవుతున్నాయి. టేకాఫ్‌ల్లో మాత్రం అంతరాయం నెలకొంది" అని బైడెన్‌ వివరించారు. అమెరికా కాలమానం ప్రకారం గురువారం ఉదయం 9 గంటల నాటికి విమాన సేవలు పూర్తిస్థాయిలో సాధారణ స్థితికి వచ్చే అవకాశముందని ఎఫ్ఏఏ తాజాగా వెల్లడించింది.

ABOUT THE AUTHOR

...view details