వచ్చే ఏడాది జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేయడం కోసం భారతీయ అమెరికన్, దక్షిణ కరోలినా గవర్నర్ నిక్కీ హెలీ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వ బరిలోకి దిగుతున్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఆమె అభ్యర్థిత్వం కోసం పోటీపడతారు. ఇందుకోసం నిక్కీహెలీ మంగళవారం నుంచే తన అభ్యర్థిత్వ ప్రచారాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఓ వీడియో సందేశం ఇస్తూ.. "భారత సంతతీయుల కుమార్తెగా నేను గర్వపడుతున్నాను. తెలుపు, నలుపు లేదు. నీ పని.. తేడాలపై కాదు సారూప్యతలపై చూపించమని మా అమ్మ ఎప్పుడూ చెబుతుంటుంది. మన ఆలోచనలను కొందరు జాత్యాహంకారంగా భావిస్తారు. కానీ సత్యానికి మించినది ఏదీ లేదు. చైనా, రష్యాలు కవాతు చేస్తున్నాయి. వాళ్లంతా మనల్ని వేధించవచ్చు అనుకుంటున్నారు. కానీ నేను బెదిరింపులకు భయపడను. మీరు దెబ్బ కొట్టాలని చూస్తే అదే మీకు బలంగా తాకుతుంది. ఆర్థిక బాధ్యత, సరిహద్దు భద్రత, దేశ పటిష్ఠత కోసం కొత్త తరం నాయకత్వానికి సమయం ఆసన్నమైంది. మరో జోబైడెన్ మనకు వద్దు. దేశాన్ని మరింత గొప్పగా, స్వేచ్ఛగా మార్చే అవకాశాలు ఇంకా ఉన్నాయి. క్లిష్ట పరిస్థితిల్లో కూడా అమెరికా మమ్మల్ని చేరదీసింది. దక్షిణ కరోలినాలో పుట్టి, పెరగడం ద్వారా దేశ గొప్పతనం తెలిసింది" అని అన్నారు.