Nigeria jailbreak: నైజీరియా రాజధాని అబూజలో ఉన్న ఓ కారాగారంపై తీవ్రవాదులు దాడులకు తెగబడ్డారు. ఈ ఘటనలో దాదాపు 600 మంది ఖైదీలు పరారయ్యారు. అయితే, వీరిలో సుమారు 300 మందిని తిరిగి పట్టుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇస్లామిక్ మిలిటెంట్ వ్యతిరేక ముఠాలే ఈ దాడికి కారణమని నైజీరియా అధికారులు అనుమానిస్తున్నారు.
మంగళవారం రాత్రి 10గంటల సమయంలో పక్కా ప్రణాళికతో వచ్చిన తీవ్రవాద ముఠాలు.. కుజీ కారాగారంపై భారీ పేలుడు పదార్థాలతో దాడికి తెగబడ్డారు. విధుల్లో ఉన్న భద్రతా సిబ్బందిని హతమార్చిన దుండగులు.. పేలుడు పదార్థాలతో గోడలను కూల్చి లోనికి ప్రవేశించారు. బోకో హరమ్‌గా పిలిచే ఇస్లామిక్ మిలిటెంట్ వ్యతిరేక ముఠాలే ఈ దాడులకు పాల్పడినట్లు నైజీరియా అంతర్గత వ్యవహారాల శాఖ కార్యదర్శి శువాయిబ్ బెల్గోర్ పేర్కొన్నారు. ఆ గ్రూపునకు చెందిన వారు ఎక్కువ మంది ఖైదీలుగా ఉన్నారని.. వారిని విడిపించుకు వెళ్లేందుకే దుండగులు ఈ పథకం రచించారని అన్నారు.