Nigeria Gunmens Attack:మధ్య నైజీరియాలోని పలు గ్రామాల్లో సాయుధ మూకలు జరిపిన వరుస కాల్పులు 160మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు స్థానిక ప్రభుత్వం ఓ ప్రకటనను విడుదల చేసింది. 'బండిట్స్'గా పిలిచే సైనిక గుంపులు కొన్ని తెగలకు చెందిన ప్రజలే లక్ష్యంగా గ్రామాలపై దాడి చేసి కాల్పులకు పాల్పడ్డాయి. ప్రజల ఇళ్లలోకి చొరబడి వారిని చిత్రహింసలు పెట్టాయి.
ఆదివారం సాయంత్రం మధ్య నైజీరియాలోని పలుగ్రామాల్లో జరిగిన కాల్పుల్లో మొదట 16 మంది మృతి చెందినట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఈ మారణకాండ సోమవారం కూడా కొనసాగడం వల్ల మృతి చెందిన వారి సంఖ్య భారీగా పెరిగింది. మరో 300 మందికిపైగా ప్రజలు తీవ్రంగా గాయపడ్డారని ప్రభుత్వ అధికారులు తెలిపారు. గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. కొన్నేళ్లుగా నైజీరియాలోని ఈ ప్రాంతాల్లో మతపరమైన, సామాజిక పరమైన విబేధాల వల్ల ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా సాయుధ మూకలు కాల్పులకు తెగబడ్డాయి.
వాయవ్య, మధ్య నైజీరియాలో ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతుంటాయి. అటవీ ప్రాంతాల్లో స్థావరాలు ఏర్పాటు చేసుకున్న సంచార జాతులకు చెందిన కొన్ని సాయుధ మూకలు గ్రామాలపై దాడులు చేసి దోపిడీలకు పాల్పడుతుంటాయి. స్థానికుల్ని అపహరించి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తుంటాయి. 2009 నుంచి ఇప్పటి వరకు పలుమార్లు ఇలాంటి ఘటనలు జరగ్గా వేల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.