Nigeria Boat Accident : ఆఫ్రికా దేశం నైజీరియాలో పడవ మునిగిన ఘటనలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. తారాబా రాష్ట్రంలోని అర్డో-కోలా జిల్లాలో ఈ ఘటన జరిగింది. నదిలో ప్రయాణిస్తున్న సమయంలో పడవ బోల్తా పడినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో మరో 70 మంది గల్లంతయ్యారు. దేశంలోనే అతిపెద్ద నది అయిన బెన్యూలో ఈ పడవ ప్రయాణిస్తోంది. స్థానిక చేపల మార్కెట్ నుంచి వ్యాపారులతో తిరిగి వస్తోంది. ఈ క్రమంలోనే పడవ బోల్తా పడిందని అధికారులు వెల్లడించారు.
'పడవలో 100 మందికి పైగా ప్రయాణికులు'
ప్రమాదం జరిగిన సమయంలో పడవలో 100 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. అందులో 14 మందిని మత్య్సకారులు, స్థానికుల సాయంతో రక్షించినట్లు నైజీరియా జాతీయ అత్యవసర సేవల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇప్పటివరకు 17 మృతదేహాలను వెలికితీసినట్లు వెల్లడించింది. ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు తారాబా గవర్నర్ అగ్బు కెఫాస్. నదీజలాలు సంపదకు వనరుగా ఉండాలని, మరణాలకు కాదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
'మృతదేహాలు దొరికే ఛాన్స్ లేదు'
పడవ ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారని తారాబా పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం బెన్యూ నది ఉద్ధృతంగా ప్రవహిస్తోందని తెలిపారు. ఫలితంగా సహాయక చర్యలు చేపట్టడానికి విఘాతం కలుగుతోందని వివరించారు. ప్రవాహం అధికంగా ఉన్న నేపథ్యంలో ఘటనాస్థలిలో మృతదేహాలు దొరుకుతాయన్న ఆశ కూడా లేదని వ్యాఖ్యానించారు.