Nigeria Boat Accident : నైజీరియాలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. ఓ పడవ క్వారా రాష్ట్రంలోని నైజర్ నదిపై బోల్తా పడిన ఘటనలో 100 మంది మరణించగా.. అనేక మంది గల్లంతు అయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు నీటిలో మునిగిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బాధితులు పెళ్లికి వెళ్లి వస్తుండగా జరిగిందీ దుర్ఘటన. పడవలో మహిళలతో పాటు పిల్లలు కూడా ప్రయాణిస్తున్నారని పోలీసులు తెలిపారు.
నదిలో పెళ్లి 'బోటు' బోల్తా.. 100 మంది మృతి.. అనేక మంది గల్లంతు - ఈజిప్టులో రోడ్డు ప్రమాదం తాజా వార్తలు
21:08 June 13
నదిలో పెళ్లి 'బోటు' బోల్తా.. 100 మంది మృతి.. అనేక మంది గల్లంతు
పెళ్లి కోసం వెళ్లి..
బాధితులు.. నైజర్ రాష్ట్రంలోని ఎగ్బోటి గ్రామంలో ఆదివారం రాత్రి ఓ వివాహ వేడుకకు హాజరయ్యేందుకు వెళ్లారని పోలీసులు చెప్పారు. అనంతరం తిరిగి తమ స్వగ్రామానికి వెళ్లే క్రమంలో సోమవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో నైజర్ నదిలో బోటు బోల్తా పడిందని తెలిపారు. పడవ ప్రమాద సమయంలో పడవలో వంద మందికి పైగా ప్రయాణిస్తున్నారని చెప్పారు. మంగళవారం మధ్యాహ్నం నాటికి కొన్ని నదిలో మునిగిపోయిన కొన్ని మృతదేహాలను వెలికితీశామని పోలీసులు తెలిపారు. మిగతా వాటి కోసం గాలిస్తున్నామని తెలిపారు. ఈ సహాయక చర్యల్లో స్థానికులు కూడా పోలీసులకు సాయం చేస్తున్నారు.
ట్రక్కుపైకి దూసుకెళ్లిన బస్సు.. 15 మంది దుర్మరణం..!
Egypt Road Accident : ఈజిప్టులో రోడ్డుపై ఆగి ఉన్న ఓ పికప్ ట్రక్కుపైకి ప్రయాణికులతో వెళ్తున్న ఓ మినీబస్సు ప్రమాదవశాత్తు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 15 మంది అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. అనేక మంది తీవ్ర గాయాలపాలయ్యారు. రాజధాని కైరోకు దక్షిణంగా దాదాపు 34 మైళ్ల దూరంలో ఉన్న రహదారిపై మంగళవారం జరిగిందీ ప్రమాదం.
ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు కూడా గాయపడ్డారని.. వారిని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. కాగా, ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని.. దర్యాప్తు జరుగుతోందని అధికారులు చెప్పారు. 'ప్రమాదం జరిగినప్పుడు మినీబస్సు మితిమీరిన వేగంతో వచ్చింది. ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన పికప్ ట్రక్ డ్రైవర్‌ను విచారణ కోసం అదుపులోకి తీసుకున్నాం' అని అధికారులు తెలిపారు. కాగా, గతనెల నైరుతి ఈజిప్టులోని హైవేపై కూడా ప్రయాణీకులతో వెళ్తున్న ఓ బస్సు నెమ్మదిగా కదులుతున్న ట్రక్కును ఢీకొట్టిన ఘటనలో 17 మంది మరణించారు. ఫిబ్రవరిలో కూడా ఈజిప్టు తూర్పు నగరమైన ఇస్మాలియా సమీపంలో పికప్ ట్రక్కును మినీబస్సు ఢీకొనడం వల్ల ఆరుగురు చనిపోయారు.