కరోనా వైరస్ మహమ్మారి విజృంభణతో గత రెండేళ్లుగా యావత్ ప్రపంచం వణికిపోతూనే ఉంది. ఆ మహమ్మారి సృష్టించిన విలయానికి ప్రపంచ దేశాలు ఇప్పటికీ కోలుకోలేకపోతున్నాయి. ఈ క్రమంలోనే ప్రస్తుతం చోటుచేసుకుంటోన్న వాతావరణ మార్పులు తదుపరి మహమ్మారికి కారణం అవుతుండవచ్చని తాజా అధ్యయనం అంచనా వేసింది. విపరీతంగా పెరుగుతోన్న ఉష్ణోగ్రతల వల్ల అడవి జంతువులు జనావాస ప్రాంతాల్లోకి తరలి రావడం, తద్వారా వైరస్‌లు జంతువుల నుంచి మానవులకు సోకడంతో మరో మహమ్మారి ముప్పును పెంచుతున్నట్లు తాజా నివేదిక పేర్కొంది. వాతావరణ మార్పులు వైరస్‌ల సంక్రమణపై జార్జ్‌టౌన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనం ఈ వివరాలు వెల్లడించింది.
'ప్రస్తుతం మా ఆందోళన మార్కెట్లపైనే. ఎందుకంటే, అనారోగ్యకరమైన జంతువులను ఒకేచోట చేర్చడం వల్ల అత్యవసర పరిస్థితులకు కారణమ్యే ప్రమాదాలను సృష్టిస్తుంది. ముఖ్యంగా గబ్బిలాల నుంచి మధ్యంతర జీవులకు, అక్కడనుంచి ప్రజలకు వైరస్ సోకే పరిస్థితులకు దారితీస్తాయ్’ అని జార్జ్‌టౌన్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్‌కు చెందిన వైద్య నిపుణులు డాక్టర్ కొలిన్ కార్ల్‌సన్ పేర్కొన్నారు. అటువంటి ప్రమాదమే వాతావరణ మార్పుల వల్ల వాస్తవరూపం దాల్చే అవకాశం ఉందన్నారు. ఎబోలా, కరోనా వంటి వైరస్‌లు కొత్త ప్రాంతాల్లో విస్తరించడానికి ఇవి అవకాశం కల్పించే ప్రమాదం ఉందన్నారు. దాంతో మూలాలను గుర్తించలేని విధంగా మారడంతోపాటు వన్యప్రాణుల నుంచి మానవులలోకి వైరస్‌లు ప్రవేశించేందుకు వాతావరణ మార్పులు కారణమవుతాయని అన్నారు.