Next Coronavirus Pandemic :ప్రపంచాన్ని కలవరపెట్టిన కరోనా తరహా మరో మహమ్మారి ప్రబలే అవకాశం అధికంగా ఉందని ప్రముఖ వైరాలజిస్ట్, చైనా బ్యాట్‌వుమన్ షీ జెంగ్లీ హెచ్చరించారు. గబ్బిలాలు, ఎలుకలు, ఒంటెలు, పందులు, పాంగోలియన్ వంటి జీవుల ద్వారా ఈ వైరస్ వ్యాపించే ప్రమాదం ఉందని తన పరిశోధనలో పేర్కొన్నారు. గతంలో జంతువుల నుంచి మనుషులకు వ్యాపించిన వైరస్‌లను ఆధారంగా చేసుకొని తాజా పరిశోధన చేశారు జెంగ్లీ. వైరస్ లక్షణాలు, జనాభా, జన్యువైవిధ్యం తదితర వివరాలతో మానవాళికి ప్రమాదకరమని భావించే 40 రకాల కరోనా వైరస్ జాతులపై అధ్యయనం నిర్వహించారు. వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి చెందిన పలువురు శాస్త్రవేత్తలు సైతం ఈ పరిశోధనలో భాగమయ్యారు.
'మనుషుల్లో వ్యాధులకు కరోనా వైరస్ కారణమై ఉంటే.. భవిష్యత్‌లో కూడా మహమ్మారి సోకే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కొవిడ్ మహమ్మారిని ఎదుర్కొన్న విధంగానే.. భవిష్యత్‌లో ఈ వైరస్‌లను సమర్థంగా అడ్డుకునేందుకు ప్రపంచం సిద్ధంగా ఉండాలి' అని తమ పరిశోధనా పత్రంలో జెంగ్లీ వివరించారు. జంతువుల ద్వారా వ్యాప్తి చెందే వైరస్‌లపై జెంగ్లీ పరిశోధన చేస్తుంటారు. ఈమెకు చైనా బ్యాట్ వుమన్‌గా పేరుంది. అయితే, ఆమె తాజా పరిశోధనను చైనాలోని ఇతర వైరాలజిస్ట్లు తోసిపుచ్చారు.
'రష్యన్ గబ్బిలాల్లో కొత్త వైరస్.. వ్యాక్సిన్లు పని చేయవ్!'
Disease X News :మరోవైపు, డిసీజ్ ఎక్స్ రూపంలో ప్రపంచానికి మరో మహమ్మారి ముప్పు పొంచి ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా తరహాలోనే డిసీజ్ ఎక్స్ సైతం ప్రపంచవ్యాప్తంగా లక్షల మందిపై ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు. కొవిడ్‌తో పోలిస్తే డిసీజ్ ఎక్స్.. 7 రెట్లు అధిక ప్రభావం చూపిస్తుందని బ్రిటన్ వ్యాక్సిన్ టాస్క్‌ఫోర్స్‌కు నేతృత్వం వహిస్తున్న డేమ్ కేట్ బింగ్ హామ్ వెల్లడించారు. 5 కోట్ల మంది ప్రజలు ఈ వైరస్ వల్ల ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని అంచనా వేశారు. కొత్త మహమ్మారిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలంటూ గతకొంతకాలంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం హెచ్చరిస్తున్న నేపథ్యంలో తాజాగా బ్రిటన్ నిపుణుల ప్రకటనపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.