నేపాల్ కొత్త అధ్యక్షుడిగా నేపాలీ కాంగ్రెస్ పార్టీ నేత రామ్ చంద్ర పౌడెల్ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. అధ్యక్ష భవనం శీతల్ నివాస్‌లో జరిగిన వేడుకలో నేపాల్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హరి కృష్ణ కార్కి.. రామ్ చంద్ర పౌడెల్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ వేడుకకు ప్రధాని పుష్ప కమల్ దహల్, స్పీకర్ దేవ్ రాజ్ గిమిరే, జాతీయ అసెంబ్లీ ఛైర్మన్ గణేశ్ ప్రసాద్ తిమిల్సిన తదితరులు హాజరయ్యారు.
ఇటీవల నేపాల్‌లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో నేపాలీ కాంగ్రెస్‌కు చెందిన రామ్ చంద్ర పౌడెల్ విజయం సాధించారు. ప్రధాని ప్రచండ నేతృత్వంలోని 8 పార్టీల కూటమి రామ్ చంద్ర పౌడెల్‌కు మద్దతు పలికింది. రామ్ చంద్ర గతంలో స్పీకర్, పలుమార్లు మంత్రిగా పనిచేశారు. ఇక ఆరు సార్లు చట్టసభ సభ్యుడిగా కూడా ఆయన పని చేశారు. అంతేకాకుండా ఓ దశాబ్దం పాటు జైలు జీవితం కూడా అనుభవించారు. 2008లో నేపాల్ గణతంత్ర దేశంగా మారాక.. మూడు సార్లు అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. నేపాల్ 3వ అధ్యక్షుడిగా రామ్ చంద్ర పౌడెల్ బాధ్యతలు స్వీకరించారు. 1944 అక్టోబరు 14న రైతు కుటుంబంలో జన్మించారు రామ్ చంద్ర పౌడెల్. 16 సంవత్సరాల వయసులోనే ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించారు.