తెలంగాణ

telangana

ETV Bharat / international

ల్యాండింగ్​కు ముందు క్రాష్.. లోయలో పడ్డ విమానం.. 68 మంది మృతి

నేపాల్​లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 68 మంది ప్రాణాలు కోల్పోయారు. 72 మందితో వెళ్తున్న విమానం.. అదుపు తప్పి నదీలోయలో పడిపోయింది. ఈ ఘటనపై భారత్ విచారం వ్యక్తం చేసింది.

nepal-plane-crash
nepal-plane-crash

By

Published : Jan 15, 2023, 5:11 PM IST

Updated : Jan 16, 2023, 6:10 PM IST

నేపాల్​లో ఘోర విషాదం జరిగింది. ఐదుగురు భారతీయులు సహా 72 మందితో వెళ్తున్న ఓ విమానం ల్యాండింగ్​కు ముందు కుప్పకూలింది. ఈ ఘటనలో 68 మంది ప్రాణాలు కోల్పోయారు. పొఖారాలోని విమానాశ్రయానికి సమీపంలోని సేతి నది ఒడ్డున ఈ విమానం అదుపుతప్పి క్రాష్ అయింది. నేపాల్ పౌర విమానయాన అథారిటీ (సీఏఏఎన్) ప్రకారం.. యెటి ఎయిర్​లైన్స్​కు చెందిన 9ఎన్-ఏఎన్​సీ ఏటీఆర్-72 అనే విమానం ఈ ప్రమాదానికి గురైంది. ఖాఠ్​మాండూలోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఆదివారం ఉదయం 10.33 గంటలకు విమానం బయల్దేరింది. ఉదయం 11 గంటలకు పర్యటక ప్రాంతమైన పొఖారాకు ఇది చేరుకోవాల్సి ఉంది. పొఖారాలోని పాత విమానాశ్రయానికి, నూతనంగా నిర్మించిన విమానాశ్రయానికి మధ్య ఈ విమానం కుప్పకూలింది.

విమానం మొత్తం సామర్థ్యం 72 కాగా.. ప్రమాద సమయంలో 68 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది అందులో ఉన్నారు. ఐదుగురు భారతీయులు సహా విమానంలో మొత్తం 10 మంది విదేశీ ప్రయాణికులు ఉన్నారని నేపాల్​లోని భారతీయ ఎంబసీ ట్వీట్ చేసింది. వీరిని అభిషేక్ కుష్వాహా, బిశాల్ శర్మ, అనిల్ కుమార్ రాజ్​భర్, సోనూ జయస్​వాల్, సంజయ్ జయస్​వాల్​గా గుర్తించినట్లు ఎయిర్​లైన్ అధికారులు తెలిపారు.

విమానం శకలాలు
ఘటనాస్థలిలో విమానం శకలాలు

విమాన ప్రమాదానికి గల కారణాలేంటనేవి తెలియలేదు. క్రాష్​కు ముందు ఎయిర్​పోర్టుతో పైలట్ కాంటాక్ట్ అయ్యారని నేపాల్ పౌర విమానయాన శాఖ తెలిపింది. పొఖారా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని చైనా సహాయంతో నేపాల్ నిర్మించింది. రెండు వారాల క్రితమే నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహాల్ ప్రచండ ఈ విమానాశ్రయాన్ని ప్రారంభించారు. ప్రమాదం నేపథ్యంలో ప్రచండ.. అత్యవసర మంత్రిమండలి సమావేశం ఏర్పాటు చేశారు. మృతులకు సంతాపంగా సోమవారం దేశవ్యాప్తంగా సెలవు ప్రకటించారు. ఘటనపై విచారణ కోసం ఐదుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. తాజా ప్రమాదం నేపథ్యంలో దేశంలోని విమానాలన్నింటినీ తనిఖీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. విమానాల్లో సాంకేతిక లోపాలేవీ లేకుండా చూసుకోవాలని స్పష్టం చేసింది.

మృతుల కుటుంబీకుల వేదన

ప్రమాదం నేపథ్యంలో పొఖారా విమానాశ్రయాన్ని మూసివేశారు. విమానాల రాకపోకలన్నీ నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగినట్లు పలు వీడియోలను బట్టి తెలుస్తోంది. ఘటన జరిగిన తర్వాత స్థానికులు సహాయక చర్యలు చేపట్టినట్లు సమాచారం. అయితే, నదీ లోయ కాబట్టి అగ్నిమాపక దళాలు వెంటనే ఘటనాస్థలికి వెళ్లలేకపోయాయని, అందువల్ల మంటలు అదుపులోకి రాలేదని స్థానిక పోలీసులు తెలిపారు.

విమానానికి అంటుకున్న మంటలకు వెలువడిన పొగ

భారత్ విచారం
ఈ ప్రమాదంపై భారత్ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. బాధిత కుటుంబాలకు తమ సానుభూతి ఉంటుందని ప్రకటించింది. పొఖారాలో జరిగిన ప్రమాదం తనను కలచివేసిందని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ట్వీట్ చేశారు.

Last Updated : Jan 16, 2023, 6:10 PM IST

ABOUT THE AUTHOR

...view details