తెలంగాణ

telangana

ETV Bharat / international

నేపాల్​ కొత్త అధ్యక్షుడిగా రామ్​ చంద్ర.. 'ప్రచండ' ప్రభుత్వ భవిష్యత్తు సేఫ్​!

నేపాల్ కొత్త అధ్యక్షుడిగా నేపాలీ కాంగ్రెస్‌కు చెందిన రామ్ చంద్ర పౌడెల్ ఎన్నికయ్యారు. ప్రధాని ప్రచండ నేతృత్వంలోని 8 పార్టీల కూటమి రామ్‌ చంద్ర పౌడెల్‌కు మద్దతు పలికింది. దీంతో గురువారం జరిగిన ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు.

Nepal elects Ram Chandra Poudel of the Nepali Congress as new President
Nepal elects Ram Chandra Poudel of the Nepali Congress as new President

By

Published : Mar 9, 2023, 5:15 PM IST

Updated : Mar 9, 2023, 5:24 PM IST

నేపాల్ కొత్త అధ్యక్షుడిగా నేపాలీ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన రామ్ చంద్ర పౌడెల్ ఎన్నికయ్యారు. గురువారం జరిగిన ఎన్నికల్లో ఆయనకు మద్దతుగా 214 మంది పార్లమెంటు శాసనసభ్యులు, 352 ప్రావిన్షియల్ అసెంబ్లీ సభ్యులు ఓటు వేశారు. దీంతో ఆయన విజయం సాధించినట్లు ఎన్నికల సంఘం ప్రతినిథి తెలిపారు. 'రాష్ట్రపతిగా ఎన్నికైనందుకు నా స్నేహితుడు రామ్‌ చంద్ర పౌడెల్‌జీకి హృదయపూర్వక అభినందనలు' అని నేపాలీ కాంగ్రెస్‌ చీఫ్‌ షేర్‌ బహదూర్‌ దేవుబా ట్వీట్‌ చేశారు.

ఉదయం 10 గంటలకు అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. కఠ్‌మండూలోని పార్లమెంట్‌ భవనంలో నేపాల్ చట్టసభసభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అధ్యక్ష పదవికి నేపాలీ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన రామ్‌ చంద్ర పౌడెల్, CPN-UMLకు చెందిన సుభాష్​ చంద్ర నెంబాంగ్‌ పోటీ పడ్డారు. ప్రధాని ప్రచండ నేతృత్వంలోని 8 పార్టీల కూటమి రామ్‌చంద్ర పౌడెల్‌కు మద్దతు పలుకగా.. మరో అభ్యర్థి నెంబాంగ్‌కు CPN-UML మద్దతుగా నిలిచింది. చివరకు రామ్​ చంద్ర పౌడెల్ ఎన్నికయ్యారు. అధ్యక్ష ఎన్నికల్లో 518 మంది ప్రావిన్షియల్ అసెంబ్లీ సభ్యులు, 313 మంది ఫెడరల్ పార్లమెంట్ సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నట్లు ఎన్నికల సంఘం ప్రతినిధి శాలిగ్రామ్ తెలిపారు.

ప్రస్తుత అధ్యక్షుడు బిద్యదేవీ భండారీ పదవీకాలం ఈనెల 12తో ముగియనుంది. నేపాల్‌లో రాజకీయ అస్థిరత నెలకొన్న వేళ.. ఈ అధ్యక్ష ఎన్నికలు ప్రధాని పుష్పకమాల్ దహాల్ ప్రచండ ప్రభుత్వ భవిష్యత్‌ను నిర్దేశించనున్నాయి. 2008లో గణతంత్ర దేశంగా అవతరించిన తర్వాత మూడోసారి నేపాల్​లో అధ్యక్ష ఎన్నికలు జరిగాయి.

కాగా, నేపాల్​ నూతన ప్రధానమంత్రిగా పుష్ప కమల్ దహాల్ 'ప్రచండ'.. గతేడాది డిసెంబరు 26వ తేదీన ప్రమాణస్వీకారం చేశారు. నాటకీయ పరిణామాల మధ్య కొత్త కూటమిని ఏర్పాటు చేసిన ప్రచండ.. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. ప్రధాని పదవిని పంచుకునే విషయంలో ఏర్పడ్డ అభిప్రాయభేదాల కారణంగా పాత కూటమికి గుడ్​బై చెప్పారు ప్రచండ. దీంతో ఎన్నికల్లో పోటీ చేసిన ఐదు పార్టీల అధికార కూటమి.. ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయింది. ప్రధాని పదవిని చెరో రెండున్నరేళ్లు పంచుకోవాలని ఎన్నికలకు ముందు మాజీ ప్రధాని దేవ్​బా, ప్రచండ అంగీకరించుకున్నారు.

అయితే, తొలి రెండున్నరేళ్లు ప్రధాని పదవి తనకు అప్పగించాలని ప్రచండ చేసిన ప్రతిపాదనను దేవ్​బా తిరస్కరించగా.. ప్రతిష్టంభన ఏర్పడింది. దీంతో కూటమి విచ్ఛిన్నమైంది. ఫలితంగా విపక్షంలో ఉన్న తన పాత మిత్రుడు, మాజీ ప్రధాని ఓలిని సంప్రదించి.. మద్దతు కోరారు ప్రచండ. ఇందుకు ఓలి సుముఖంగా స్పందించగా.. 169 మంది చట్టసభ్యుల మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటుకు ప్రచండ ముందుకొచ్చారు. ఈ నేపథ్యంలో ప్రచండను ప్రధానిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Last Updated : Mar 9, 2023, 5:24 PM IST

ABOUT THE AUTHOR

...view details