Nepal Earthquake : రిక్టర్ స్కేల్‌పై 6.3 తీవ్రతతో నమోదైన భూకంపం నేపాల్‌ను వణికించింది. నేపాల్‌లోని దీపయాల్‌కు 21 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు తెలిపారు. దోతి జిల్లాలో ఇల్లు కూలి ఓ మహిళ, ఇద్దరు చిన్నారులు సహా ఆరుగురు మృతి చెందారు. జిల్లాలో ప్రాణ, ఆస్తినష్టం భారీగా సంభవించిందని అధికారులు తెలిపారు. నేపాల్ ఆర్మీ సహాయ చర్యల్లో పాల్గొంటోంది. నేపాల్‌లో ఒక్కరోజు వ్యవధిలో రెండు ప్రకంపనలు, మూడు భూకంపాలు, అనంతర ప్రకంపనలు ఒకటి సంభవించినట్లు అధికారులు తెలిపారు. భూకంపంలో మరణించిన వారికి సంతాపం తెలిపిన నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవ్‌బా.. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు.
భారత్‌ను తాకిన భూకంప ప్రభావం
నేపాల్ భూకంప ప్రభావంతో దిల్లీతో పాటు సరిహద్దు ప్రాంతాలైన గాజియాబాద్, గురుగ్రామ్, లఖ్‌నవూ.. ఉత్తరాఖండ్‌లోని పితోరాగఢ్ సహా పలుప్రాంతాల్లో కొన్ని సెకన్లపాటు భూమి కంపించింది. ప్రజలంతా గాఢనిద్రలో ఉన్న సమయంలో ప్రకంపనలు రావటం వల్ల భయాందోళనకు గురయ్యారు. ఇళ్లనుంచి బయటికి పరుగులు తీశారు. దిల్లీలోని పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి దాటాక 20 సెకన్లపాటు ప్రకంపనలు రాగా.. రిక్టరు స్కేలుపై 1.6 తీవ్రత నమోదైంది. ఉత్తరాఖండ్‌లోని పితోర్‌గఢ్‌కు సమీపంలోని హిమాలయ ప్రాంతంలో రాత్రి 1.57 గంటలకు భూకంపం సంభవించింది. బుధవారం ఉదయం 6 గంటల 27 నిమిషాలకు 4.3 తీవ్రతతో భూకంపం వచ్చిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. భూ అంతర్భాగంలో 5 కిలోమీటర్ల లోతులో ప్రకంపణలు వచ్చాయని పేర్కొంది.