Nepal Earthquake 2023 : హిమాలయన్ దేశం నేపాల్‌లో భూకంపం సంభవించి సుమారు 128 మంది మృతి చెందారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. అందుకు సంబంధించిన వివరాలను అక్కడి అధికారులు వెల్లడించారు. నేపాల్‌లోని వాయువ్య జిల్లాలోని పలు ప్రాంతాల్లో భూకంపం సంభవించినట్లు పేర్కొన్నారు. ప్రతికూల పరిస్థితుల మధ్యే సహాయ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు.
Nepal Earthquake News : అర్ధరాత్రి కావడం వల్ల పలు ప్రాంతాలతో కమ్యూనికేషన్ తెగిపోయిందని అధికారులు తెలిపారు. దీంతో తొలుత ప్రమాద తీవ్రత తెలియలేదని చెప్పారు. ప్రజలంతా నిద్రలో ఉన్న సమయంలో భూకంపం సంభవించినట్లు వెల్లడించారు. భూకంపం ధాటికి రోడ్లపై కొండ చరియలు విరిగిపడడం, వంతెనలు దెబ్బతినడం వల్ల సహాయ చర్యలకు ఆటంకం కలుగుతోందని అధికారులు తెలిపారు. జజార్‌కోట్‌లో భూకంపం తర్వాత కూడా నాలుగు ప్రకంపనలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. శుక్రవారం రాత్రి 11 గంటల తర్వాత జాజర్ జిల్లాతో పాటు పరిసర ప్రాంతాల్లో రిక్టర్ స్కేల్‌పై 6.4తీవ్రతతో భూకంపం సంభవించినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. భూకంప కేంద్రం 11 మైళ్ల లోతులో ఉన్నట్లు గుర్తించింది.