Nepal Earthquake 2023 : భారీ భూకంపం నేపాల్‌ను వణికించింది. ప్రకృతి విలయం భారీ సంఖ్యలో ప్రజల ప్రాణాల్ని బలిగొంది. ఇప్పటివరకు 157 మంది మరణించారని అధికారులు తెలిపారు. శుక్రవారం రాత్రి సంభవించిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.4గా నమోదైంది. ప్రాణనష్టంతో పాటు ఆస్తి నష్టం కూడా భారీగా ఉన్నట్లు తెలుస్తోంది. వందల ఇళ్లు నేలమట్టం కావడం వల్ల శిథిలాల కింద ఇంకా చాలామంది ఉండొచ్చని అనుమానిస్తున్నారు. పెద్దఎత్తున సహాయచర్యలు కొనసాగుతున్నాయి.
ఖాఠ్‌మండూకు 400 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం
Nepal Earthquake Epicenter : నేపాల్ రాజధాని ఖాఠ్‌మండూకు 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న జజర్‌కోట్‌లో భూకంప కేంద్రం గుర్తించినట్లు నేపాల్ జాతీయ భూకంప పర్యవేక్షణ, పరిశోధన కేంద్రం తెలిపింది. 11 మైళ్ల లోతు నుంచి భూకంపం సంభవించినట్లు గుర్తించారు. భూకంపం ధాటికి కొండప్రాంత గ్రామాలకు సంబంధాలు తెగిపోయినట్లు అధికారులు తెలిపారు. ప్రతికూల పరిస్థితుల మధ్యే నేపాల్ ఆర్మీ, భద్రతా దళాలు సహాయ చర్యల్లో పాల్గొంటున్నాయి. క్షతగాత్రులు సుర్ఖేత్ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. భూకంపం ధాటికి కొండ రోడ్లపై చరియలు విరిగిపడటం, వంతెనలు దెబ్బతినడం వల్ల సహాయ చర్యలకు ఆటంకం కలుగుతోందని అధికారులు తెలిపారు. జజార్‌కోట్‌లో భూకంపం తర్వాత కూడా నాలుగు ప్రకంపనలు వచ్చినట్లు అధికారులు తెలిపారు.
Nepal Earthquake News Today : పశ్చిమ నేపాల్‌లోని జాజర్‌కోట్, రుకుమ్ జిల్లాల్లో భూకంప ప్రభావం ఎక్కువగా ఉంది. ఈ రెండు జిల్లాల్లోనే మృతుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రధానమంత్రి పుష్ప కమల్ దహల్ భూకంప ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. జరిగిన ప్రాణ, ఆస్తి నష్టంపై విచారం వ్యక్తం చేశారు. 2015లో నేపాల్‌లో సంభవించిన భూకంపంలో 9వేల మంది మరణించారు.