Nawaz Sharif Return To Pakistan :పాకిస్థాన్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ పార్టీ అధినేత నవాజ్ షరీఫ్ నాలుగేళ్ల స్వీయ ప్రవాసం తర్వాత స్వదేశానికి తిరిగి చేరుకున్నారు. దుబాయ్ నుంచి ప్రత్యేక విమానం ఉమీద్-ఇ-పాకిస్థాన్‌లో ఇస్లామాబాద్ చేరుకున్నారు. ఆయన వెంట కొందరు కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు, స్నేహితులు వచ్చినట్లు పీఎంఎల్-ఎన్ వర్గాలు తెలిపాయి.
Nawaz Sharif Return Date 2023 :అవినీతి ఆరోపణల కేసులో జైలు శిక్ష పడిన నవాజ్ షరీఫ్ మెరుగైన వైద్యచికిత్స కోసం లండన్ వెళ్లి అక్కడే నాలుగేళ్లు ఉన్నారు. జనవరిలో పాకిస్థాన్ సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయన స్వదేశానికి తిరిగి చేరుకున్నారు. నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పీఎంఎల్-ఎన్ పార్టీ ఎన్నికల్లో తలపడనుంది. ఇస్లామాబాద్‌లో గంటసేపు ఉన్న తర్వాత నవాజ్ షరీఫ్ లాహోర్‌కు చేరుకున్నారు. అక్కడ ఆయనకు స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు.
అంతకుముందు, దుబాయ్‌లో మీడియాతో నవాజ్ షరీఫ్ మాట్లాడారు. పాకిస్థాన్‌లో ప్రస్తుతం భయానక పరిస్థితులు ఉన్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత ఆర్థిక సంక్షోభం నుంచి పాకిస్థాన్‌ను గట్టెక్కించే సత్తా తమ పార్టీకి ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. స్వయంకృపరాధాలే పాక్‌ను ముంచేశాయని పేర్కొన్న ఆయన.. పరిస్థితిని మరింత దిగజార్చకోకూడదని అన్నారు. పరిస్థితులను చక్కదిద్దే సామర్థ్యం తమకు ఉందని చెప్పుకొచ్చారు. పాక్‌ను ఎవరూ పైకి లేపరని, సొంతంగానే ఎదగాలని అన్నారు. తన తండ్రి తిరిగి వచ్చిన రోజు తనకు అత్యంత ఆనందకరమైనదని షరీఫ్ కుమార్తె మరియం నవాజ్ పేర్కొన్నారు. రాజకీయంగానూ ఆయన ఘనంగా తన పునరాగమనాన్ని చాటుతారని చెప్పారు.