Navalny Russia Missing : రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను విమర్శించే చట్ట సభ సభ్యుల అనుమానాస్పద మరణాలు గతంలో పలుమార్లు జరిగాయి. ఈ నేపథ్యంలోనే పుతిన్ పాలనపై తీవ్ర విమర్శలు చేసే అవినీతి వ్యతిరేక ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, విపక్ష నేత అలెక్సీ నవానీ జైలు నుంచి కనిపించకుండా పోయినట్లు సమాచారం. ఈ ఏడాది ఆగస్టులో నవానీకి 19 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఫౌండేషన్ కార్యకలాపాల విషయంలో జైలు శిక్ష పడిన నవానీని మాస్కోకు 150 మైళ్ల దూరంలో ఉన్న పీనల్ కాలనీ జైలులో ఉంచారు.
ఆరు రోజులుగా తెలియని నవానీ జాడ
Navalny Russian Opposition Leader : నవానీని సంప్రదించాలని ప్రయత్నించగా తమకు జైలు నుంచి ఎలాంటి స్పందన రాలేదని ఆయన న్యాయవాదులు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఆరు రోజులుగా ఆయన జాడ తెలియడం లేదని పేర్కొన్నారు. సోమవారం నవానీ వర్చువల్‌గా కోర్టులో హాజరుకావాల్సి ఉంది. జైలులో విద్యుత్ సమస్య వల్ల ఆయన్ను హాజరుపర్చలేమని అధికారులు తెలిపారు. నవానీ మిస్సింగ్‌పై అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. రష్యాలోని దౌత్యకార్యాలయం ద్వారా మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తామని అమెరికా జాతీయ భద్రతా మండలి ప్రతినిధి జాన్ కిర్బీ వెల్లడించారు.