PM Modi France Visit : ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ ఆహ్వానం మేరకు రెండు రోజుల పర్యటన నిమిత్తం.. ఆ దేశం వెళ్లిన ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. ఫ్రాన్స్ ప్రధాని ఎలిసబెత్ బోర్న్ పారిస్ విమానాశ్రయానికి వెళ్లి మోదీకి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఫ్రాన్స్ దళాలు మోదీకి గౌరవ వందనం సమర్పించాయి. ఇరు దేశాల జాతీయ గీతాన్ని ఆలపించారు.
పారిస్‌లోని హోటల్ వెలుపల పెద్ద ఎత్తున చేరుకున్న ప్రవాస భారతీయులకు ప్రధాని మోదీ అభివాదం చేశారు. పారిస్‌లో దిగిన వెంటనే ట్వీట్ చేసిన ప్రధాని.. ఈ పర్యటనలో భారత్-ఫ్రాన్స్ మధ్య సహాయ సహకారాలను పెంపొందించుకోవాలని ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నట్లు పేర్కొన్న మోదీ.. ప్రవాస భారతీయులతో చర్చించనున్నట్లు తెలిపారు.
రెండు రోజుల పర్యటన కోసం ఫ్రాన్స్ వెళ్లిన ప్రధాని మోదీ శుక్రవారం జరిగే ఫ్రాన్స్ జాతీయ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. పారిస్‌లో జరిగే ఫ్రాన్స్ నేషనల్ డే పరేడ్‌లో మోదీ పాల్గొననున్నారు. ఐరోపాలోనే అతిపెద్ద సైనిక కవాతుగా పేరొందిన ఈ పరేడ్‌లో మోదీ గౌరవ వందనాన్ని స్వీకరిస్తారు. 269 మంది సభ్యులతో కూడిన భారత త్రివిధ దళాలు కూడా ఈ కవాతులో పాల్గొంటాయి. ఫ్రెంచ్ జెట్‌లతో పాటు భారత వైమానిక దళానికి చెందిన మూడు రాఫెల్ ఫైటర్ జెట్‌లు కూడా విన్యాసాలలో పాల్గొననున్నాయి.
ప్రధాని మోదీ గౌరవార్థం ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ అధికారిక విందుతో పాటు ప్రైవేటు విందును కూడా ఇవ్వనున్నారు. ఈ క్రమంలో ఇరువురు నేతలు వివిధ అంశాలపై సుదీర్ఘ చర్చలు జరుపుతారు. ఫ్రాన్స్ పర్యటన సందర్భంగా ఆ దేశ ప్రధాన మంత్రితోపాటు సెనెట్, నేషనల్ అసెంబ్లీ అధ్యక్షులతోనూ భేటీ అవుతారు. అనంతరం అక్కడి ప్రవాస భారతీయులు, భారత్, ఫ్రెంచ్ సంస్థల CEOలు, ఇతర ప్రముఖులతోనూ మోదీ ప్రత్యేకంగా సమావేశం అవుతారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి ట్వీట్ చేశారు. మోదీ రెండు రోజుల పర్యటనలో కీలక ఒప్పందాలు, చర్చలు కూడా జరగనున్నట్లు తెలుస్తోంది.
Bastille Day Parade Guest PM Modi : తన ఫ్రాన్స్ పర్యటన ఇరుదేశాల ద్వైపాక్షిక, వ్యూహాత్మక భాగస్వామ్యానికి నూతన ప్రేరణ ఇవ్వనుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. భారత్ -ఫ్రాన్స్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఇది 25వ సంవత్సరమని తెలిపారు. వచ్చే 25ఏళ్లలో ఇరుదేశాల మధ్య సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లేదిశగా.. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్‌తో విస్తృత చర్చల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు పర్యటనకు వెళ్లే ముందు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఫ్రెంచ్ జాతీయ దినోత్సవం.. బాస్టిల్ డే వేడుకల్లో ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొంటున్నందున.. ఈ పర్యటన ఎంతో ప్రత్యేకమని ప్రధాని పేర్కొన్నారు. ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై ఇరుదేశాలు కలిసి పనిచేయనున్నట్లు తెలిపారు.